హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోమవారం ఓ పీజీ విద్యార్థినిపై ఫ్యాన్ విరిగి పడిన ఘటన కలకలం రేపింది. వైద్య విద్యార్థిని స్వల్ప గాయాలు కావటంతో ఉస్మానియా జూడాలు ఉదయం కొద్ది సేపు మౌన దీక్ష చేపట్టారు. అనంతరం సూపరింటెండెంట్‌కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నిరసన తెలుపుతూ మరికొందరు పీజీ విద్యార్థులు ఆస్పత్రిలో హెల్మెట్ ధరించి విధులు నిర్వహించారు (medical students wearing helmets).
గతంలోను ఇలాంటి ఘటనలు
గతంలోనూ ఉస్మానియాలో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. ఎమర్జెన్సీ భవంతి సహా... సూపరింటెండెంట్ గదిలోనూ పెచ్చులూడి పడ్డాయి. అయితే ఆయా ఘటనల్లో ఎవరూ గాయపడలేదు. ఉస్మానియాకి నిత్యం 1,500 నుంచి 2,000 వరకు ఓపీ రోగులు వస్తుంటారు. దాదాపు 27 విభాగాలకు చెందిన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆస్పత్రిలో వెయ్యి వరకు అధికారిక పడకలుండగా.. మరో 500లకు పైగా పడకలు అదనంగా నిర్వహిస్తున్నారు. నిత్యం రోగులతో రద్దీగా ఉండే ఉస్మానియాలో ఇలాంటి ఘటనలు జరగటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు.
అలాంటి సమస్యలేమీ లేవు..
భవనాల్లో పెచ్చులూడటం వంటి సమస్యలు లేవని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ఫ్యాన్ మరీ పాతది కావటం వల్ల స్క్రూ ఉడిపోయిందని వివరణ ఇచ్చారు (medical students wearing helmets). ఫ్యాన్ ఊడిపడిన విభాగం నుంచి గతంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని... మరోమారు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు సూపరింటెండెంట్ తెలిపారు.
భవనంలో పెచ్చులు ఊడిపోవడం అనేది జరగలేదు. అది పాత ఫ్యాను. ఆ ఫ్యాను మార్చమని సంబంధిత డిపార్ట్మెంటు నుంచి కూడా ఎప్పుడూ రాలేదు. ఆ ఫ్యాను ఊడిపడి పీజీ విద్యార్థిని చిన్న గాయమైంది. వాస్తవానికి అన్ని ఫ్యానులను మార్చాము. కానీ ఆ డిపార్ట్మెంటు నుంచి ఫ్యాను విషయమై గతంలో ఎటువంటి ఫిర్యాదు రాకపోవడం వల్ల దానిని మార్చలేదు. కొత్త బిల్డింగ్‌లో ఎప్పుడూ పెచ్చులూడిపోవడం జరగలేదు. వాటర్ లీకవ్వడం, డ్రైనేజీ బ్లాక్ అవ్వడమే జరిగాయి. వాటిని కూడా అప్పటికప్పుడే పరిష్కరించాము. నూతన భవనాన్ని నిర్మించాలని జూనియర్ డాక్టర్లు కూడా ఇవాళ వినతి పత్రాన్ని ఇచ్చారు. ప్రభుత్వం కూడా అందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. కాకపోతే హైకోర్టులో కేసులు ఉండడం వల్ల తీర్పు వచ్చిన తర్వాతనే పనులు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుంది. - డాక్టర్ నాగేంద్ర, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్.
ఇదీ చూడండి: Osmania hospital: ఉస్మానియా ఆస్పత్రిలో ఊడిపడిన ఫ్యాన్.. వైద్యురాలి తలకి గాయం