Marri Shashidhar Reddy Comments: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు చాలా బాధకలిగించేవిగా ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ వ్యవహార శైలితో పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాగూర్ చేతిలో రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నట్టు లేదని.. ఠాగూరే.. రేవంత్ చేతిలో పనిచేస్తున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలో ఏం జరుగుతుందో అధిష్ఠానానికి తెలియనీయడం లేదని మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. తమ ఆవేదన అడవి కాచిన వెన్నెల చందంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని కలిసి సమస్యలు చెప్పినప్పుడు.. ప్రత్యేకంగా ఒక మెకానిజం ఏర్పాటు చేస్తామని చెప్పి నాలుగు నెలలైనా ఇప్పటి వరకు అతీలేదు గతీ లేదని విమర్శించారు. పార్టీలో చేరికలకు సంబంధించి ప్రత్యేకంగా జానారెడ్డి అధ్యక్షతన కమిటీ ఉన్నా అది ఈగలు తోలుకోవాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. కింది స్థాయిలో పార్టీ నాయకులతో సమన్వయం లేకుండా ఏకపక్షంగా చేరికలు జరుగుతున్నాయి. తద్వారా గ్రూపిజం పెరిగి పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని మర్రి శశిధర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: భాజపా పాదయాత్రతో కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందన్న తరుణ్ చుగ్