Mahashivratri 2023 Special Story: త్రినేత్రుడు, త్రిగుణాతీతుడు అయిన పరమేశ్వరుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. మహా శివరాత్రి పర్వదినం నాడు తెలిసో తెలియకో ఓ మారేడు దళాన్ని శివలింగం మీదకు విసిరేసినందుకే చాలా మంది భక్తులకు ఆ జన్మలోని పాపాలన్నీ తొలగిపోయి ఉత్తర జన్మలన్నీ ఉత్తమోత్తమ జన్మలుగా లభించాయి. పురాణాల్లో కేవలం ఈ విధంగా మారేడు దళాలను శివలింగానికి అర్పించి పుణ్యాన్ని పొందిన భక్తులు చాలా మంది ఉంటారు. మనం నిత్యం శివాలయాలలో బిల్వార్చనలు అనగా మారేడు దళాలతో అర్చనలు, పండగలప్పుడు లక్ష బిల్వార్చనలు భక్తులు జరుపుతుంటారు.
శివ పురాణంలో.. ఇలా చేయటమంతా మారేడు విశిష్టతకు ప్రతీకగా కనిపిస్తుంది. సాహిత్యంలోనూ చాలా చోట్ల ఈ వృక్ష మహిమ గురించి తెలుగు కవులు చాలా చక్కగా వివరించారు. శివ పురాణం విద్యేశ్వర సంహిత సాధ్యసాధన ఖండం ఇరవై రెండో అధ్యాయం వివరణలోనే శివభక్తులలో ఉన్న ప్రవృత్తి, నివృత్తిపరుల భక్తి విశేషాలు కూడా సవివరంగా కనిపిస్తున్నాయి. శివుడికి ప్రీతిపాత్రమైన మారేడు దళాల విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా చేస్తే పుణ్యఫలం.. మారేడు చెట్టు మహాదేవుడి స్వరూపం. ఆ చెట్టును దేవతలంతా స్తుతిస్తుంటారు. ఈ జగతిలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థాలు ఎన్ని ఉన్నాయో ఈ పుణ్యక్షేత్రాలు అన్నీ ఈ చెట్టు పాదులో ఉంటాయి. మారేడు వృక్షం మూలంలో లింగ రూపంలో ఉన్న శివుడిని పూజించడం ఎంతో పుణ్యప్రదం. ఆ చెట్టు మొదట్లో స్నానం చేసిన వారికి సర్వ తీర్థాలలో స్నానం చేసినంత మహా పుణ్యం లభిస్తుందని ప్రతీతి. అలా స్నానం చేసిన వాడే అసలైన పవిత్రుడని పురాణాలలో కొన్నిచోట్ల చెప్పడమూ జరిగింది. ఆ వృక్షం కుదురు ఎంతో గొప్పది. ఆ చెట్టు నీటితో తడిసి ఉన్నప్పుడు మహాశివుడు చూస్తే ఆయనకెంతో ఆనందం కలుగుతుంది. ఆ పరమ శివుడి అనుగ్రహం పొందాలంటే మారేడు చెట్టు మొదలును నిత్యం నీటితో తడుపుతున్నా సరిపోతుంది. గంధ పుష్పలతో ఆ మూలాన్ని పూజించిన అలాంటి వారు శివలోకార్హతను పొందుతారు. ఆ భక్తుల ఇంట సంతానం, సౌభాగ్యం వర్థిల్లుతూ ఉంటుంది.
వృక్షం కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా.. మారేడు చెట్టు మొదట్లో శ్రద్ధతో వరుసగా దీపాలను పెట్టిన వారికి తత్వజ్ఞానం లభించి అంత్యంలో మహేశ్వరుడిలో ఐక్యమయ్యే అదృష్టం కూడా లభిస్తుంది. కొత్త చిగుళ్లతో ఉన్న మారేడు కొమ్మను తాకటం, ఆ చెట్టును పూజించటం లాంటివి పాప విముక్తికి దోహదకారులు. అంతటి పవిత్రమైన మారెడ చెట్టు కింద ఒక్క భక్తుడికి భోజనం పెట్టినా కోటిరెట్ల పుణ్యఫలం లభిస్తుంది. ఆ వృక్షం కింద పాలు, నెయ్యితో వండిన పరమాన్నాన్ని శివభక్తుడికి పెడితే అది మొదలు ఇంకా ఎప్పటికీ ఏ జన్మలోనూ అలా పరమాన్నం పెట్టిన వాడికి దరిద్రం అనేది ఉండదు. శివ నైవేద్యంగా లభించే ఈ మారేడు దళాన్ని పొందిన వారు మహా పుణ్యాత్ముడవుతాడు. శివ ప్రసాదంలో పత్రం, ఫలం, పుష్పం, జలం లాంటివన్నీ సాలగ్రామ స్పర్శ, శివలింగ స్పర్శ వల్ల అవి ఎంతో పవిత్రతను సంతరించుకుంటాయి.
భిక్షాటనతో లభించిన ఆహారం నైవేద్యంగా.. శివపూజ చేసే వారిలో ప్రధానంగా రెండు రకాల వారుంటారు. ఆ ఇద్దరికీ ఈ మారేడు దళాలు శివలింగమంత విలువైనవే. ప్రవృత్తి, నివృత్తి అనే రెండు రకాల ఈ భక్తి మార్గాలలో శివ భక్తులు పూజ చేస్తుంటారు. ప్రవృత్తి మార్గాన్ని అనుసరించే వారు శివలింగ పీఠాన్ని పూజిస్తారు. ఆ విధంగా చేయడం వల్ల వాళ్లకి సర్వ దేవతలను పూజించినంత ఫలం లభిస్తుంది. ఆ విధంగా చేసే భక్తులు అభిషేకం చేసి నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని నైవేద్యం ఇస్తుంటారు. శివుడికి పూజ అనంతరం ఆ శివలింగాన్ని శుద్ధి చేసి సంపుటిలో పెట్టి పవిత్రమైన ప్రదేశంలో జాగ్రత్తగా భద్రపరుస్తుంటారు. ఈ నివృత్తి మార్గంలో నడిచే భక్తులు చేతిలోనే శివలింగాన్ని ఉంచుకొని పూజించి భిక్షాటనతో లభించిన ఆహారాన్ని ఆ శివలింగానికి ప్రసాదంగా పెడతారు.
ఔషధీయ గుణాలు.. ఓంకారాన్ని సూక్ష్మ లింగంగా భావించి ఉపాసించటం నివృత్తి పరులలో కనిపించే మరో ప్రత్యేకత. ఆ శివ భక్తులు లింగాన్ని విభూతితో అర్చించటం, దానినే నైవేద్యంగా ఇవ్వటం కూడా ఉంది. అలాగే పూజ అయిన తర్వాత శివలింగాన్ని సర్వదా శిరస్సు మీదనే ధరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ కథా సందర్భంలో మారెేడు వృక్షం మహిమ గురించి శివభక్తులలోని ప్రవృత్తి, నివృత్తి అనే మార్గాలను అనుసరించే భక్తులను గురించి వివరించటం కనిపిస్తుంది. ఈ మారేడు చెట్టు ఇంతటి పవిత్రతను కలిగి ఉండటానికి ఆ చెట్టు దళాలు, బెరడు మిగతా భాగాలు అన్నింటిలోను జాషధ గుణాలు ఉన్నాయని ఆధునిక శాస్త్రవేత్తలు విశ్లేషించి నేటి ప్రజలకు చెబుతున్నారు.
ఇవీ చదవండి: