కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రేటర్‌లో కొత్త ఆటోల కొనుగోలుకు పర్మిట్లను నిషేధించింది. అయిదారేళ్లుగా ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. ఆటో సంఘాలు ఇప్పటికే విన్నవించినా ఆ దస్త్రం ముందుకు కదలలేదు. నిరుద్యోగులతో పాటు ఉపాధి కోసం చాలామంది నగరంలో ఆటోలను కొని తిప్పుతుంటారు. కొందరైతే రోజువారి అద్దెకు తీసుకొని వీటిని నడుపుతూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.
డిమాండ్ పేరుతో.. అడ్డదారిలో!
ఆటోలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. వాస్తవానికి 15-20 ఏళ్లు దాటినవి తుక్కు కింద మార్చుకోవచ్చు. ఆ ఛాసెస్ నంబరుతో అనుమతి పత్రం తీసుకొని కొత్త ఆటోను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక్కడే కొందరు తెలివి ప్రదర్శిస్తున్నారు. నాగోలు కేంద్రంలో పాత వాహనాలను తుక్కు కింద మార్చే ప్రక్రియ జరుగుతుంటుంది. కొన్ని ఆటోలను అలా చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. వాటికి మరమ్మతులు చేసి రోడ్లపై తిప్పుతున్నారు. అదే ఛాసెస్ నంబరుతో మరో కొత్తదానికి అనుమతి తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు నిఘా పెడితే అసలు గుట్టు బయటపడే అవకాశం ఉంది.
వాయు కాలుష్యం...
కాలం చెల్లిన వాహనాలతో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఒక్క హైదరాబాద్ రవాణాశాఖ పరిధిలోనే 15-20 ఏళ్లు దాటిన వాహనాలు 6.81 లక్షలు ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను కలిపితే 15 లక్షలకు దాటుతుందని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం పదిహేనేళ్లు దాటినవి రహదారుల పైకి రావాలంటే హరిత పన్ను చెల్లించాలి. ఇదెక్కడా పాటించడం లేదు. బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకారం పదిహేనేళ్లు దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు ముగిసిన వ్యక్తిగత వాహనాలు ఇక తుక్కు కింద మార్చాల్సిందే. అవి రోడ్లపైకి వస్తే భారీగా జరిమానా విధించే అవకాశం ఉంది.