సాధారణంగా పబ్‌లకు లైసెన్స్ ఇచ్చేది ఎక్సైజ్ శాఖ. నిబంధనల ప్రకారం పబ్‌కి మైనర్లను అనుమతించకూడదు. 18 ఏళ్ల పైబడిన వారు వచ్చినా కూడా వారికి మద్యం ఇవ్వడానికి వీలులేదు. 21 ఏళ్ల దాటిన వారికే మద్యం అందించాలన్న నిబంధన ఉంది. సాధారణ వాడుక బాషలో పబ్‌గా పిలుచుకున్నప్పటికి అవన్నీ రెస్టారెంట్‌ల పేరుతో, కెఫేల పేరుతో నమోదై ఉంటున్నాయి. వాటినే పబ్‌లుగా మార్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లలతో కలిసి వచ్చే కుటుంబాలకు, మైనర్లకు పబ్‌లోకి అనుమతి లభిస్తుంది. గత నెల 28న అమ్నేషియా పబ్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు 150 నుంచి 200 మంది పాల్గొన్నారు. వీరిలో అధికంగా మైనర్లేనని తెలిసింది. ఒక్కొక్కరి నుంచి రూ.900 వసూలు చేసినట్లు తెలిసింది. మద్యం సరఫరా చేయలేదని చెబుతున్నారుగానీ దీనిపై పూర్తి విచారణ చేయాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. రాజధానిలో అధికారికంగా, అనధికారికంగా 174 వరకు పబ్‌లు ఉన్నాయి. వీటికి రోజూ వచ్చే వారిలో 20 శాతం మంది మైనర్లు ఉంటున్నారని చెబుతున్నారు.
నిబంధనలు తుంగలోకి తొక్కి..
* పబ్‌లలోకి మైనర్లను అనుమతించడమే కాకుండా మద్యం సరఫరా చేస్తున్నా అటు పోలీసులు ఇటు ఎక్సైజ్ అధికారులు పట్టనట్లుగా ఉండిపోతున్నారు. ఆ అధికారం తమది కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
* కాసులకు కక్కుర్తి పడే కొందరు పబ్ నిర్వాహకులు మైనర్ల కోసం అనధికారికంగా పార్టీలను ఏర్పాటు చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి టిక్కెట్లను విక్రయిస్తున్నారు.
* కొందరు పోలీసులతో కుమ్మక్కై అనధికారికంగా హుక్కా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనూ మైనర్లను అనుమతిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
కఠినంగా అమలు చేస్తేనే..
* పబ్‌లకు లైసెన్స్ జారీ చేసే సమయంలోనే నిబంధనలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. లైసెన్సు ఇచ్చిన తర్వాత అక్కడ ఏమి జరిగినా తమ బాధ్యత ఏమీ లేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. లైసెన్సు ఎక్సైజ్ అధికారులు ఇచ్చినందున లోపల ఏమి జరిగినా తమకు సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరికీ పూర్తి బాధ్యతలు అప్పగించి కఠిన చర్యలు తీసుకునేలా చేస్తూనే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
* లోపల జరిగే కార్యకలాపాలకు నిర్వాహకులను బాధ్యులను చేయడంతోపాటు చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొనేలా ఉండాలి. ప్రస్తుతం ఏదైనా జరిగినా జరిమానాతో సరిపెడుతున్నారు. అలా కాకుండా లైసెన్సు రద్దు చేసేలా నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని అనేకమంది కోరుతున్నారు.
ఇదీ చూడండి..
జూబ్లీహిల్స్ ఘటనలానే పాతబస్తీలో ఇంకోటి.. రెండు కేసుల్లోనూ అవన్ని సేమ్..!