Man Killed Brother in Hyderabad For Harassing His Wife : వారిద్దరూ అన్నదమ్ములు. ఇద్దరు మద్యానికి బానిసలయ్యారు. మద్యం మత్తులో ఎవరైనా ఎలాంటి తప్పులు చేయటానికైన వెనుకాడరనే విషయం తెలిసిందే. ఆ మద్యం చివరికి ఇద్దరి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. అన్నదమ్ములను విడిపోయేలా చేయడమే కాదు.. కడతేర్చడానికి కూడా వెనకాడకుండా చేసింది. ప్రస్తుత సమాజంలో రక్త సంబంధాలు ఛిన్నాభిన్నం కావడానికి ఒక రకంగా మద్యం కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది. తప్పతాగి మద్యం మత్తులో తన భార్యను వేధించాడని కత్తితో తమ్ముడి మెడ కోసి దారుణంగా హతమార్చాడు ఓ అన్న. బుధవారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ బసవతారకనగర్‌లో నివసించే షబ్బీర్ అహ్మద్ , సజ్జి అహ్మద్(39) ఇద్దరు అన్నదమ్ములు. వృత్తిరీత్యా వెల్డర్స్ అయిన వీరు కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యారు. సజ్జి అహ్మద్ దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మనస్పర్థల కారణంగా సజ్జి భార్య ఐదేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. మరోవైపు షబ్బీర్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు కాగా, ఓ కుమార్తె ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందింది. అహ్మద్ భార్య సైతం ఏడాది కిందట అతడిని వదిలేసి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
Wife And Husband Murder : చేతబడి చేస్తున్నారని అనుమానం.. గొడ్డలితో నరికి దంపతుల హత్య
ఇద్దరిదీ ఒకేరోజు జన్మదినం : షబ్బీర్ అహ్మద్ భార్యను సజ్జి అహ్మద్ తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఇదే విషయమై అన్నాదమ్ముల మధ్య చాలాసార్లు గొడవ కూడా జరిగింది. ఈ క్రమంలోనే తన తమ్ముడిని ఎలాగైనా అంతం చేయాలనుకున్నాడు షబ్బీర్. దానికోసం పక్కా ప్లాన్ ఆలోచించాడు. దానికి పుట్టిన రోజు వేడుకను వేదికగా చేసుకోవాలనుకున్నాడు.
Man Killed Brother in Hyderabad : షబ్బీర్ అహ్మద్, సజ్జి అహ్మద్‌ల పుట్టిన రోజు ఈ నెల 4వ తేదీ బుధవారమే. ఇద్దరి మధ్య రెండేళ్ల తేడా ఉన్నప్పటికీ.. పుట్టింది మాత్రం ఒకే రోజు. ఇదే రోజు తమ్ముడు సజ్జి అహ్మద్‌ను హతమార్చాలని షబ్బీర్ పథకం వేశాడు. ఆరోజే మద్యం, కత్తిని తెచ్చి ఇంట్లో దాచుకున్నాడు. అనుకున్న ప్రకారం రాత్రి తమ్ముడితో కలిసి బాగా మద్యం తాగిన షబ్బీర్ .. తన భార్యను వేధిస్తున్నాడని అతనితో మరోసారి గొడవ పడ్డాడు. ఇద్దరి అన్నదమ్ముల మధ్య మాటామాట పెరిగింది. షబ్బీర్ అహ్మద్.. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కత్తితో దాడి చేసి సజ్జి మెడ కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో సజ్జి అక్కడే ప్రాణాలు వదిలాడు.
తన కుమారుడి హత్యను చూసిన తండ్రి వృద్ధాప్యం కారణంగా అడ్డుకోలేక కుమారుడు కళ్లముందే ప్రాణాలు విడుస్తుంటే తల్లడిల్లిపోయాడు. షబ్బీర్ తన తమ్ముడిని హతమార్చిన అనంతరం.. డయల్ 100కు ఫోన్ చేసి తాను హత్య చేసినట్లు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఫిలింనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడు షబ్బీర్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.