కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన భాజపా... మాదిగలను మోసం చేసిందని మాదిగ ఐకాస కో-ఆర్డినేటర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా... నాంపల్లిలోని భాజపా కార్యాలయాన్ని ముట్టడించినట్లు పేర్కొన్నారు.
తమ అక్రమ అరెస్టును నిరసిస్తూ... బేగంబజార్ పోలీసు స్టేషన్లో ఐకాస నాయకులు ఆందోళన నిర్వహించారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
మాదిగలు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి కాళ్లు మొక్కినా ఫలితం లేకపోయిందన్నారు. మాదిగ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. మాదిగలను నమ్మించి మోసం చేసిన భాజపాను తెలంగాణలో చిత్తు చేస్తామని... మాదిగ జాతిని ఐక్యం చేసి తమ హక్కులను సాధించుకుంటామని పిడమర్తి రవి స్పష్టం చేశారు.