Shivraj Singh Chouhan on KCR: కేసీఆర్ పిరికివాడని.. ఇలాంటి సీఎంను తానెక్కడ చూడలేదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు, కార్యక్రమాలకు బదులిచ్చే సంప్రదాయం ఉందని.. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కన్పించడం లేదన్నారు. భాజపా కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ నేత శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి బండి సంజయ్ సభ నిర్వహించారు. బండి సంజయ్ పోరాటస్ఫూర్తిని ప్రదర్శించారని అభినందించిన శివరాజ్ సింగ్ చౌహాన్... రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. అక్రమంగా జైల్లో వేస్తే ఆ జైల్లోనే పుట్టిన శ్రీకృష్ణుడు రాక్షసుడైన కంసుడిని వధించాడని శివరాజ్ సింగ్ తెలిపారు. హుజూరాబాద్‌లో భాజపా గెలిస్తే... తెరాస కారు పంక్చరైందని ఎద్దేవా చేశారు.
కూతురిని కూడా మంత్రి చేస్తారేమో?
తెలంగాణ గడ్డపైకి వచ్చింది.. భాజపా చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడానికేనని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేసింది... బెదిరింపులకు భయపడే పార్టీ భాజపా కాదన్న శివరాజ్ సింగ్.. కేసీఆర్‌కు కలలో కూడా ‘బండి సంజయ్’ గుర్తుకొస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. తండ్రి సీఎం, కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, ఇంకో బంధువు ఎంపీ.. కూతురు ఎమ్మెల్సీ.. ఆమెను కూడా మంత్రిని చేస్తారేమోనని ఆయన అభిప్రాయపడ్డారు.
నేను నాలుగోసారి..
కేసీఆర్ నేను కూడా సీఎంనే. నువ్వు రెండోసారి సీఎం కావొచ్చు... నేను నాలుగోసారి సీఎంగా కొనసాగుతున్నా.. మీలాగా సంస్కార హీనంగా వ్యవహారించడం లేదు. భాజపా అంటే బిర్యానీ అనుకున్నావా కేసీఆర్. మేడం సోనియాగాంధీ కూడా ఎందుకింత గాభరా పడుతోంది. పంజాబ్ ప్రభుత్వం ప్రధానమంత్రిని దేశ సరిహద్దులో 20 నిమిషాలు రోడ్డుపై ఆపేస్తే మద్దతిస్తారా? ఇదేనా రాజనీతి?. కేసీఆర్.. డబుల్ బెడ్రూం ఇండ్ల సంగతేమైంది?. నిరుద్యోగ భృతి ఏమైంది?. కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది?. వీటికి జవాబు ఎందుకు ఇవ్వడం లేదు? -శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ సీఎం
ధర్మయుద్ధం మొదలైంది..
తెలంగాణలో ధర్మయుద్ధం మొదలైందని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేసీఆర్ రైతు వ్యతిరేకి అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. 2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చి తీరుతుందని... కాషాయ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: