కొవిడ్ పరిస్థితుల తర్వాత వ్యాపార వర్గాలు డిజిటల్ మంత్రాన్ని పఠిస్తున్నాయి. రాష్ట్రాన్ని డిజిటల్ రంగంలో ముందుకు తీసుకుపోవడంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా లభ్యమయ్యే ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లు కల్పించి.. చిరు వ్యాపారులకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో మేడ్ ఇన్ తెలంగాణ మాల్ (MADE IN TELANGANA MALL) యాప్‌ను ప్రారంభించింది. అధికారికంగా దీన్ని ప్రారంభించినప్పటికీ... జనవరి నుంచి ఈ ప్లాట్‌ఫాం అందుబాటులోకి రానుంది.
ఈ యాప్ ద్వారా స్థానికంగా దొరికే వస్తువులను ఈ పోర్టల్ ద్వారా ప్రదర్శించి, విస్తృత మార్కెట్ కల్పనకు అవకాశం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే పోచంపల్లి చీరలు, ముత్యాలు, బిద్రి కళారూపాలు మొదలైనవి ఈ ఆన్లైన్ మాల్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మకోవచ్చు. 2022 జనవరి నుంచి కొనుగోలుదారులకు మేడ్ ఇన్ తెలంగాణ మాల్ యాప్ అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయం ద్వారా దళారుల ప్రమేయం లేకుండా చిరువ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. దీనికోసం ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ (Jayesh Ranjan) తెలిపారు.
మన రాష్ట్రంలో ఎంతో మంది కళాకారులు దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన వస్తువులు తయారు చేస్తున్నారు. వారు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకోడానికి సరైన వసతి లేక స్థానికంగా ఉన్న మార్కెట్ వరకే పరిమితమవుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ లింకర్స్ సహకారంతో ఆన్లైన్ మాల్ యాప్‌ను తీసుకొచ్చింది. దాని పేరు మేడ్ ఇన్ తెలంగాణ. మీరు తయారుచేసిన వస్తువులను ఈమాల్ ద్వారా ప్రదర్శించుకోవచ్చు. కొనుగోలు దారులు వస్తు నాణ్యతను చూసుకుని వారికి కావాల్సిన వస్తువుల కోసం ఆర్డర్ చేసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిలో ఒక పైసా కూడా కమీషన్ ఉండదు. మీ వస్తువులకు ఏదేతే ధర నిర్ణయిస్తారో దాని ప్రకారమే అన్ని లావాదేవీలు జరుగుతాయి. మేడ్ ఇన్ తెలంగాణ మాల్‌ను మీరు పూర్తిగా వినియోగించుకోగలుగుతారని ఆశిస్తున్నాను. మీరు తయారు చేసే వస్తువులకు రాబోయే రోజుల్లో చాలా విశాలవంతమైన మార్కెట్ అందుబాటులో ఉంటుంది. ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలి.-జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి
ఇదీ చూడండి: Suicide attempt at raj bhavan: 'మా కేసీఆర్ దేవుడు.. ఆయన కోసం ప్రాణాలైనా ఇస్తా.!'