మంచి వారి మౌనం నేరస్థుల నేరాలకు బలం అవుతుందని కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ ఆచార్య మాడభూషి శ్రీధర్(madabhushi sridhar) అన్నారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మౌనంగా ఉండకూడదని సూచించారు. వాటిపై ప్రశ్నించాలని కోరారు. తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో సీపీఐ(cpi) రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి(chada venkat reddy) రచించిన ప్రభుత్వాల బందీగా ప్రజాస్వామ్యం పుస్తకావిష్కరణ సభను నిర్వహించారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో జరగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.
వ్యాసాలు పుస్తక రూపంలో..
సమకాలీన రాజకీయాలపై వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలను పుస్తకరూపంలో తీసుకురావడం అభినందనీయమని మాడభూషి కొనియాడారు. రక్తపాతం లేకుండా తెలంగాణ రాష్ట్రం సాయుధ పోరాటం ద్వారా వచ్చిందని... సర్దార్ వల్లభాయ్ పటేల్(sardar Vallabhbhai Patel) సైన్యం వల్ల కాదని చాడ ఈ పుస్తకంలో చక్కగా వివరించారని తెలిపారు. భాజపా(bjp) రాజకీయ లబ్ధి కోసం పటేల్ తమ నాయకుడని చెప్పుకుంటోందని అన్నారు.
ప్రచార హంగామా
రాజకీయ, సామాజిక అంశాలు ప్రతిబింబించేలా కేంద్ర, రాష్ట్ర పాలకుల వ్యక్తిగత పోకడలు, అన్యవర్గ ధోరణులు వివరించారన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు అత్యంత ఉత్సాహపూర్వకంగా నిర్వహించాలనే తలంపుతో మోదీ(pm modi) ప్రభుత్వం... 75 వారాలు ముందుగానే ప్రకటించడమే ప్రభుత్వ ప్రచార హంగామాకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యన్ని పాతరేస్తూ... నాయకులు అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలను చాడ ఈ పుస్తకంలో ఎత్తి చూపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత చాడ వెంకట్ రెడ్డి, పలువురు రచయితలు, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: HARISH RAO: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్‌రావు