ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో కులాంతర ప్రేమ పెళ్లి వ్యవహారం వివాదానికి దారి తీసింది. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై అమ్మాయి తరఫు బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

గణపవరం గ్రామానికి చెందిన పొలిశెట్టి రవి అనే యువకుడు.. గుంటూరుకు చెందిన మహ్మద్ షాహీనా అనే యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరు మేజర్లు కావటంతో... వారం క్రితం పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నాదెండ్ల పోలీస్ స్టేషన్కు వెళ్ళి.. రక్షణ కల్పించాలని వేడుకున్నారు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ చేసి పంపించారు.


అంతా బాగానే ఉందని భావించిన రవి తరఫు కుటుంబసభ్యులు.. బుధవారం రోజున నోములు జరుపుకుంటుున్నారు. పూజ జరుగుతున్న సమయంలో షాహీనా బంధువులు రవి ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోవడంతో పాటు.. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని గొడవను అదుపు చేశారు.
ఇదీ చదవండి: అక్రమ కేసులు పెట్టేవారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు: చంద్రబాబు