రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కేసులు పెరుగుతున్నా.. మరణాల రేటు తక్కువగానే ఉందన్నారు. ప్రజలు భయాందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదని సూచించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి కిట్లు అందుబాటులో ఉన్నాయని... ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని తెలిపారు.
'ర్యాపిడ్ టెస్టులతో వెంటనే రిజల్ట్ తెలుస్తోంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి వెంటనే కరోనా కిట్ ఇస్తున్నాం. రిపోర్ట్ వెంటనే రావడం వల్ల కాంటాక్టు ట్రేసింగ్ సులభమవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో టెస్టులు, వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. అవకాశం లేనివారికి ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న జిల్లాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బందిని సమకూర్చుకునేందుకు ఆదేశాలిచ్చాం. సామాజిక బాధ్యతగా ప్రైవేటు ఆస్పత్రులూ వైద్యం అందించాలి. ప్రైవేటు ఆస్పత్రులు కరోనా వైద్య ఖర్చులు సాధ్యమైనంత వరకు తగ్గించి తీసుకోవాలి. కేసులు పెరుగుతున్నా.. మరణాల రేటు తక్కువగానే ఉంది.
--- ఈటల రాజేందర్, వైద్యారోగ్య శాఖ మంత్రి
కరోనా పరీక్షలను అవసరమైతే లక్ష వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటల స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆయన ఎక్కువ మందిలో లక్షణాలు లేవని తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నామని ఈటల పేర్కొన్నారు. ప్రజలు తప్పకుండా ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా తీవ్రతపై మంత్రి ఈటల సమీక్ష