హైదరాబాద్‌లో లాక్‌డౌన్ అమలును డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకిదిగి పర్యవేక్షించారు. ఈసీఐఎల్ చౌరస్తాలో పర్యటించిన ఆయన... నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. కూకట్‌పల్లి వద్ద జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును తనిఖీ చేశారు. ఉదయం తొమిదిన్నర నుంచే దుకాణాలు మూసివేయాలని యజమానులకు సూచించారు. అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చేవారి వాహనాలు సీజ్ చేసి... లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఉదయం 10 తర్వాత నగరంలోకి వచ్చే రహదారులను మూసివేస్తామని డీజీపీ తెలిపారు. సరకు రవాణా వాహనాలకు రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఉదయం 8 గంటల తర్వాత సరకు రవాణా వాహనాలు తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాజధానిలోని మూడు కమిషనరేట్లలో..
హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో లాక్‌డౌన్ అమలును.. సీపీలు పర్యవేక్షించారు. ఉదయం 10లోపే పనులు ముగించుకోవాలని.. సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. అల్లాపూర్, బోరబండ, మోతీనగర్‌లో సజ్జనార్ పర్యటించారు. ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావోద్దని అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలు జప్తు చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు. నాంపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్, బేగంపేటలో లాక్‌డౌన్ అమలును హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పర్యవేక్షించారు. ఉప్పల్, నాచారం, కుషాయిగూడ ప్రాంతాల్లో పోలీస్ చెక్‌పోస్టులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు.
పార్టీ పేరుతో హల్చల్..
అత్యవసరంగా వెళ్లే వారి పత్రాలు, ఈ-పాస్‌లను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీచేస్తున్నారు.నకిలీ పాసులు, పరిధి దాటి వెళ్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. సమయం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. తెరాస నేతలమంటూ కార్లపై పేర్లు రాసుకొని తిరుగుతున్న వారి వాహనాలు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. షాపూర్‌నగర్ చెక్ పోస్ట్ వద్ద మల్కాపూర్ తెరాస గ్రామాధ్యక్షుడినని వెళ్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మరో వ్యక్తి తెరాస రాష్ట్ర యూత్ వింగ్ అని కారుపై రాసుకుని అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాన్ని సీజ్ చేశారు.
స్వల్ప ఉద్రిక్తత..
మార్కెట్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు పలు వాహనాలను జప్తు చేశారు. కొంతమంది పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. బేగంబజార్‌లో సీజ్ చేసిన వాహనాలను గోషామహల్ మైదానానికి తరలించారు. రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద నగరంలోకి వచ్చే వాహనాలను తిరిగి వెనక్కి పంపించారు. చిక్కడపల్లిలో 300కు పైగా వాహనాలు సీజ్ చేసి... 400కి పైగా కేసులు నమోదుచేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద సాగర్ రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అనుమతులున్న వాహనాలనే అనుమతించారు.
ఇదీ చదవండి: 'భాజపా నేతలు కేంద్రంతో మాట్లాడి టీకాలు తెప్పించాలి'