తెలంగాణలో యాసంగి పంట, ఆంధ్రప్రదేశ్‌లో దాళ్వాగా పిలిచే రబీ సాగులో రైతుల శ్రమ ఫలించి దిగుబడుల్ని కళ్లజూసే తరుణమిది. ‘కరోనా లేకపోతే డ్యాన్స్ చేసేవాడిని’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్విగ్నభరితంగా స్పందించే స్థాయిలో, ఈసారి వరి సేద్య విస్తీర్ణం పెరిగింది.
కరోనా దెబ్బ
వాస్తవానికి అననుకూల వాతావరణంలో దెబ్బతీసిన ఖరీఫ్‌తో పోలిస్తే- తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర చోట్లా రబీ దిగుబడి అంచనాలు కొత్త ఆశలు మోసులెత్తించాయి. ఇనుమడించిన పంట దిగుబడులు ఆర్థిక మాంద్యంతో కుములుతున్న దేశాన్ని సాంత్వనపరచగలవన్న లెక్కలు, కరోనా వైరస్ అనూహ్య విజృంభణతో తలకిందులయ్యాయి.
రైతులకు కేంద్రం దన్ను
దేశవ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితిలో- చేతికి అందివచ్చిన పంటలు నోటికి దక్కుతాయా అన్న శంకలు రైతాంగం కంటికి కునుకు పట్టనివ్వడం లేదు. అటువంటి భయానుమానాల్ని చెదరగొట్టి అన్నదాతల్ని కుదుటపరచాలన్న సంకల్పం కేంద్ర మంత్రివర్గ తాజా భేటీలో ప్రస్ఫుటమైంది. లాక్‌డౌన్‌కు విఘాతం కలగకుండా పంటల కోత, సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా జిల్లాస్థాయిలో యంత్రాంగ శ్రేణుల మధ్య సమన్వయం చేసే చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు.
దిగులు చెందుతున్న రైతులు
లాక్‌డౌన్ ఆంక్షల దృష్ట్యా పెద్ద సంఖ్యలో నూర్పిడి యంత్రాలు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఇరుక్కుపోయాయి. - ఏపుగా పెరిగి కోతకు సిద్ధంగా ఉన్న పంటలు కళ్లాలకు చేరతాయో లేదోనని అసంఖ్యాక రైతులు దిగులు చెందుతున్నారు.
జనసందోహం కట్టడికి ఏర్పాట్లు
పంట కోతల కాలం అంటే- పొలాలనుంచి విపణి కేంద్రాల వరకు అంతటా జన సందోహం ఎక్కువ ఉంటుంది. రైతులు ఒక చోట గుమిగూడకుండా నివారించేందుకు గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలు ఏర్పరచి, కూపన్ల పద్ధతిలో మద్దతు ధరపై చివరి గింజవరకు వరిని, ఆఖరి కేజీదాకా మొక్కజొన్న కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందుకోసం రూ. 30వేల కోట్ల నిధినీ ప్రత్యేకించారు.
పరికరాలు, గోనె సంచుల కొరత...
చాలాచోట్ల తేమ కొలిచే పరికరాలు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు, కడకు గోనెసంచులకు తీవ్ర కొరత వెన్నాడుతోంది. ఒక్క తెలంగాణలోనే 20 కోట్ల గోనె సంచులు అవసరమన్న అంచనాల వెలుగులో, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ దృష్ట్యా- వివిధ రాష్ట్రాలకు వాటి సరఫరా ఎప్పటికి ఒక గాడిన పడుతుందో అంతు చిక్కడం లేదు.
జాగ్రత్తలు తీసుకోకుంటే నష్టమే...
రబీ దిగుబడుల సక్రమ సేకరణ, రేపటి కోసం సన్నద్ధత జాతి ఆహార భద్రతతో ముడివడిన అత్యంత కీలకాంశాలు. వీటిపై దశాబ్దాలుగా సమర్థ కార్యాచరణ కొరవడటం వ్యవస్థాగత లోపమని చెప్పక తప్పదు. ఇప్పటికే దేశం మునుపెన్నడెరుగని ఆరోగ్య సంక్షోభంతో కిందుమీదులవుతోంది. కొత్తగా ఆహార సంక్షోభం దాపురించకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అజెండాగా పట్టాలకు ఎక్కితేనే జనం తెరిపిన పడతారు.
ఇది చూడండి: డ్రోన్ వీడియో: హైదరాబాద్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?