స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (Mlc Elections) నామినేషన్ల పరిశీలన ఒక్క వరంగల్ మినహా మిగతా ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లోనూ నిన్న పూర్తైంది. వరంగల్‌లో ఒక్క అభ్యర్థి పరిశీలన నేటికి వాయిదా పడింది. కరీంనగర్, ఆదిలాబాద్‌లో అత్యధికంగా 24 మంది చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. నల్గొండలో ఎనిమిది మంది, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్‌లో నలుగురు చొప్పున పోటీలో ఉన్నారు. ఇప్పటి వరకు... రెండు చోట్ల మాత్రమే పోలింగ్ అవసరం పడని పరిస్థితి కనిపిస్తోంది.
నిజామాబాద్‌లో తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత (Kavitha) మాత్రమే పోటీలో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలు ఉండగా తెరాస అభ్యర్థులు పట్నం మహేందర్ రెడ్డి, సుంకరిరాజు మాత్రమే పోటీలో ఉన్నారు. దీంతో ఆ రెండుచోట్ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఉపసంహరణ గడువు ముగిశాక ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు.
ఏడు చోట్ల అనివార్యం...
ఇక మిగిలిన ఏడు చోట్ల పోలింగ్ (Mlc Elections) అనివార్యంగా కనిపిస్తోంది. అన్ని చోట్లా తెరాస అభ్యర్థులు ఉండగా... మెదక్, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలిచారు. స్వతంత్రులు ఏడు నియోజకవర్గాల్లోనూ పోటీలో ఉన్నారు. వీలైనంత వరకు పోటీని తగ్గించుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పోటీ నుంచి తప్పుకునేలా స్వతంత్రులను ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అందుకు వీలైన అన్ని మార్గాలను అభ్యర్థులు అన్వేషిస్తున్నారు.
ఉపసంహరణ...
ఉపసంహరణ గడువు రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. పోలింగ్ అనివార్యంగా కనిపిస్తున్న నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్‌లో తెరాస కార్పొరేటర్ రవీందర్ సింగ్.... స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో తమ ఓటర్లను తెరాస ఇప్పటికే హైదరాబాద్ సమీపంలోని క్యాంపునకు తరలించింది. మిగతా జిలాల్లోనూ ఓటర్లను క్యాంపులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: MLC candidates Assets: ఎమ్మెల్సీ బరిలో 'కోటీశ్వరులు'... ఆస్తుల వివరాలివే!