Telangana agriculture news: తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్‌లో వరి సాగుపై ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన జారీ కానుందని తెలుస్తోంది. రెండేళ్లుగా యాసంగిలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం ప్రచారం చేసింది. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బియ్యం, ఉప్పుడు బియ్యానికి డిమాండ్ బాగా పెరిగింది. రాష్ట్రంలో యాసంగిలో సాగుచేసే వరిపంట నుంచి ఉప్పుడు బియ్యం ఎక్కువగా వస్తాయి.
గతేడాది ఉప్పడు బియ్యాన్ని ఎవరు తినడం లేదని, వీటిని మద్దతు ధరకు కొనేది లేదని కేంద్రం చెప్పడం వల్ల... యాసంగిలో వరి సాగు చేయవద్దని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేసింది. ఇటీవల ముడిబియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఉప్పుడు బియ్యం ఎగుమతులపై ఆంక్షలు లేవు. ఈ నేపథ్యంలో ఎగుమతుల కోసం రాష్ట్రంలో యాసంగిలో సాగుచేసే వరిధాన్యాన్ని మిల్లర్లే కొని.. ఉప్పుడు బియ్యంగా మార్చుకుంటారని అంచనా.
దేశంలో బియ్యం నిల్వలు తగ్గుతుండటం, ప్రస్తుత వానాకాలంలో వరి సాగు తగ్గినందున కేంద్రం కూడా యాసంగిలో పండే ధాన్యాన్ని మద్దతు ధరకు కొనే అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అంచనా వేస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయానికి విస్తృతంగా సాగునీరు అందుబాటులో ఉండటంతో వరి సాగు విస్తీర్ణం రికార్డుస్థాయిలో 55 లక్షల ఎకరాలకు చేరవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: