యజమానిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన శివ ప్రసాద్ స్థిరాస్తి రంగంలో భవన నిర్మాణదారుడు. తరచూ వ్యాపార లావాదేవీలపై హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుండేవారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రశాంత్.. ఆయన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసే వాడు. శివ ప్రసాద్ తరచూ ప్రశాంత్‌ను తిట్టడం, నలుగురిలో సూటిపోటి మాటలతో అవమానించడాన్ని ప్రశాంత్ సహించలేకపోయేవాడు. 2013 ఆగష్టు 17న లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌కు శివ ప్రసాద్ వెళ్లారు. హోటల్ గది నుంచి అతను ఎంతకీ బయటకు రాకపోవడంతో.. సిబ్బంది గది తెరిచి చూడగా అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
వెంటనే హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే అతని డ్రైవర్ ప్రశాంత్ కారుతో సహా పరారయినట్లు పోలీసులు గుర్తించారు. శివప్రసాద్ ఒంటిపై బంగారు ఆభరణాలు లేకపోవడంతో డ్రైవరే హత్య చేసి పరారై ఉంటాడని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో కారు డ్రైవరును కోర్టులో హాజరు పరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. శివప్రసాద్‌ను ప్రశాంత్ హత్య చేసినట్టు నిర్ధరించింది. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి: Fake Seeds: రూ.13 కోట్ల విలువైన నకిలీ మిరప విత్తనాలు స్వాధీనం