బ్యాంకర్లను కొవిడ్ వారియర్లుగా పరిగణించి వయసుతో నిమిత్తం లేకుండా ఉద్యోగులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకర్లు విజ్ఞప్తి చేశారు. వైద్యశాఖ, పోలీసు శాఖల మాదిరిగా తాము కూడా ఖాతాదారులకు నిరంతర సేవలు అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటం వల్ల తమకు కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని వివరించారు. రెండో దశలో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగులు కోరారు.
కేంద్ర ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ అమలవుతోందని గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో వైపు ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని వెల్లడించింది. బ్యాంకర్ల విషయంలో నిబంధనలు సడలించినట్లయితే వయసుతో సంబంధం లేకుండా ఉద్యోగులందరికీ టీకా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు బ్యాంకర్లు తెలిపారు. అదే విధంగా బ్యాంకింగ్ సేవల సమయాలను కుదించాలని, వారానికి అయిదు రోజులు పనిదినాలు ఉండేట్లు చూడాలని కోరినట్లు వివరించారు.
ఇదీ చదవండి: 'కరోనా విజృంభిస్తుండటంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి'