రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన రోగులు కోలుకుని ఇంటిముఖం పడుతున్న వేళ.. హైదరాబాద్ మహానగరంలో మాత్రం వైరస్ వణుకుపుట్టిస్తోంది. ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో తన పంజా విసురుతోంది. గడిచిన నాలుగు రోజుల్లో కేసుల సంఖ్య రెండెకల్లో ఉంటుండగా.. బల్దియాలో అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 800కుపైగానే కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే వాటిలో చాలా మంది చికిత్స తీసుకొని కోలుకోగా.. ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్ట్‌ల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుందనే అనుమానంతో వారందరిని గుర్తించి హోంక్వారంటైన్లోనే ఉంచి ఆరోగ్యపరిస్థితిని సమీక్షిస్తున్నారు.
తాజాగా అక్కడ తిష్టవేసింది
నిన్న మొన్నటి వరకు వనస్థలిపురాన్ని కుదిపేసిన కరోనా వైరస్.. తాజాగా జియాగూడలో తిష్టవేసింది. నగరంలో నమోదవుతున్న కేసుల్లో జియాగూడ, కార్వాన్ ప్రాంతాల్లో 81 కేసులు ఇక్కడే ఉన్నాయి. ఈ మేరకు ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించిన బల్దియా యంత్రాంగం.. జియాగూడ పరిసరాలను అష్టదిగ్బంధనం చేసింది. ఆ ప్రాంతంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రభావిత కాలనీలు, బస్తీలను గుర్తించి 10 కంట్మెనెంట్ జోన్లను ప్రకటించారు. వాటిలో వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటింటికి తిరిగి ఆరా తీస్తున్నారు. వెంకటేశ్వరనగర్, ఇందిరానగర్, శ్రీనగర్‌లోని సబ్జిమండి కూరగాయల మార్కెట్, జియాగూడ మేకలమండి, మటన్, చికెన్ దుకాణాలు, మిగతా దుకాణాలన్నింటిని మూసివేశారు. కేవలం ఔషధ దుకాణాలు, వైన్‌షాపులు మాత్రం నడుస్తున్నాయి. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జియాగూడ ప్రాంతం మొత్తాన్ని బంద్ ప్రకటించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కేసులు పెరుగుతున్నా జనాలు మాత్రం
నగరంలోని వలసకూలీలు కూడా అత్యధికంగా కరోనా బారినపడుతున్నారు. బల్దియా అధికారులు అనుమానంగా ఉన్న మిగతా వలస కూలీలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా జనాలు మాత్రం రోడ్లపైకి భారీగా వస్తున్నారు. నిత్యం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ వాహనాలు జప్తు చేస్తున్నా ఎలాంటి కారణం లేకుండా రోడ్లపై తిరిగేవారు ఎక్కువయ్యారు. మద్యం దుకాణాలు ప్రారంభించిన మొదటి రెండు, మూడు రోజులు రద్దీ కనిపించినా ప్రస్తుతం వాటివద్ద హడావుడి తగ్గింది. కొన్ని ప్రైవేటు కార్యాలయాలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రజా రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హోంక్వారంటైన్లోని పలు కుటుంబాలు
మరోవైపు రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలోని వనస్థలిపురంలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. ఇక్కడ గతంలోనే 28 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. హుడా సాయినగర్, కాంప్లెక్స్ ఏరియా, ఎస్కేడీ నగర్, ఏటైపు బీటైపు కాలనీలు కంటైన్మెంట్ జోన్లుగా కొనసాగుతున్నాయి. మీర్‌పేటలో రెండు కుటుంబాల్లో 7 కేసులు నమోదుకాగా, తాజాగా ఆ ప్రాంతంలో ఎలాంటి కేసులు రాలేదు. జిల్లెలగూడలోని న్యూవివేక్ నగర్ కాలనీ, స్టిర్లాహిల్స్ కాలనీలో ఇంటింటి సర్వే కొనసాగుతుంది. హోంక్వారంటైన్లోని పలు కుటుంబాల్లోని సభ్యుల ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బంది వాకబు చేస్తున్నారు. సరూర్సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు 16 కేసులు నమోదయ్యాయి. వాటిలో తిరుమలనగర్‌లో 8, జేబీ కాలనీ 2, ఆర్కేపురం 2, న్యూనాగోల్‌లో 3, చైతన్యపురిలో 1 పాజిటివ్ కేసు నమోదు కాగా.. తాజాగా ఎలాంటి కేసులు రాలేదు.
అర్బన్ ప్రాంతాల్లో రికవరీ రేటు..
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జీహెచ్ఎంసీ మినహాయించి వైరస్ సోకిన వారిలో సగం మందికిపైగా రికవరీ కావడం వల్ల ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ రెండు జిల్లాలోని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉంది. మేడ్చల్ జిల్లాలో పూర్తిగా కంటెన్మెంట్ జోన్లను ఎత్తివేయగా అక్కడ అంతా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.
పరిస్థితులు మారడం
అటు వికారాబాద్ జిల్లాలోనూ పరిస్థితి కుదుటపడింది. జిల్లాలో కరోనా ప్రభావంతో 38 మంది ఆస్పత్రిపాలు ఒక్కరు చనిపోయారు. మిగిలిన వారంతా కోవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. జిల్లాలోని 8 కంటైన్మెంట్ జోన్లు ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. పరిస్థితులు సాధారణంగా మారడం వల్ల వాటిలో ఒక జోన్ మినహా మిగిలిన 7 జోన్లలో ఆంక్షలు ఎత్తివేశారు. రిక్షా కాలనీపై అనుమానంతో ఇంకా ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా కొనసాగిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా వెసులుబాటు కల్పించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం