Left Parties will work Combined in Elections : సీపీఎం, సీపీఐ పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. ఏ ఎన్నికల్లోనైనా కలిసే పోటీ చేయాలని భావిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఉభయ కమ్యునిస్టు పార్టీలు కలిసే ఉన్నాయనే సంకేతాన్ని తీసుకెళ్లాలని యోచిస్తున్నాయి. ఇందు కోసం ఒక ప్రణాళికను రూపొందించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రజా సమస్యలపై సీపీఎం, సీపీఐ కలిసి పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో ఆదివారం సీపీఎం, సీపీఐ ముఖ్య నేతల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ఇరు పార్టీల కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కునంనేని సాంబశివరావుతో పాటు ముఖ్య నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, డీజీ. నరసింహ హాజరయ్యారు. ఇరు పార్టీల నేతలు హాజరైన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. సీపీఎం, సీపీఐ చేపట్టే యాత్రలకు సంఘీభావం తెలుపుకోవాలనే అంగీకారానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసే ముందుకు వెళ్లాలని నిర్ణయంచుకున్నారు. ఏప్రిల్ 9న హైదరాబాద్‌లో సీపీఎం, సీపీఐ మండల, జిల్లా స్థాయి ముఖ్య నేతలకు సదస్సు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ సదస్సుకు సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులను రప్పించాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రభుత్వ రంగ సంస్థలను విధ్వంసం చేస్తున్నారు: దేశాన్ని రక్షించుకునేందుకు 'బీజేపీ హఠావో దేశ్ కీ బచావో' పేరుతో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14 నుంచి నెల రోజుల పాటు తెలంగాణలో 'ఇంటి ఇంటికి సీపీఐ' పేరుతో కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చాడ వెంకట్‌రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నరేంద్ర మోదీ సర్కారు రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ, ఫెడరల్ వ్యవస్థను దెబ్బ తీసిందనీ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా విధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
బీజేపీ 15సీట్లు గెలవడం మహా ఎక్కువ: బండి సంజయ్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి.. అలా వ్యాఖ్యానించడం సిగ్గు చేటని కూనంనేని అన్నారు. ఇదేనా నీకు హిందూ ధర్మం నేర్పిందనీ ప్రశ్నించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణలో 15సీట్లు గెలవడం మహా ఎక్కువ అన్నారు. రాజకీయాల్లోకి నేరచరిత్ర ఉన్నవారు ప్రవేశిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. రాజ్యాంగంను మార్చేలా దూరదృష్టిలో ఉన్నట్టు కనిపిస్తుందన్నారు. అందుకే ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే ఎన్నిక అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రాజకీయాలు దిగజారి పోతున్నాయని.. వ్యక్తిగత దూషణలు పెరిగిపోతున్నాయన్నారు.
ఇవీ చదవండి: