లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో అమ్మవారికి జూన్ 25 నుంచి జులై 26వ తేదీ వరకు బోనాల సమర్పణ ఉంటుందని మహంకాళి దేవాలయ కమిటీ తెలిపింది. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల నుంచి రక్షించాలని ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో... అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితిగా వస్తుంది. ఆలయం వద్ద థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిచడం, మాస్కులు, భౌతిక దూరం ఖచ్చితంగా పాటించేలా నిబంధనలు అమలుచేస్తామని నిర్వాహకులు తెలిపారు.
ప్రతి రోజు 50 మంది మహిళలు చొప్పున అమ్మవారికి బోనాలు సమర్పించేలా ఏర్పాట్లు చేశాం. జులై 19, 20వ తేదీల్లో మాత్రమే ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనాలు ఆలయ పూజారి మాత్రమే సమర్పిస్తారు. ఆ రెండు రోజుల్లో భక్తులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోం. - ఆలయ కమిటీ.
బోనాలతో వచ్చే మహిళల కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులు, బ్లీచింగ్, శానిటైజేషన్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కరోనా మహమ్మారి రోజు రోజూకు విజృంభిస్తోన్న నేపథ్యంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తే వ్యాధి నుంచి బయటపడవచ్చని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పట్లో అమ్మవారికి బోనాలు సమర్పించాకే కలరా వ్యాధి తగ్గిందని చరిత్రాత్మక నేపథ్యాన్ని గుర్తు చేశారు.
ఇదీ చూడండి: తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని విడుదల చేసిన కేటీఆర్