రెండేళ్లు గడిచింది... నిధులున్నా... పనులు, ప్రయత్నాలు కొనసాగుతున్నా... 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం అసంపూర్తిగానే మిగిలిపోయింది. మహబూబ్నగర్ జిల్లాను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా చేయాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. క్షేత్రస్థాయిలో వాస్తవాలపై ఆలస్యంగా మేల్కొన్న యంత్రాంగం... లక్ష్యసాధనకు ఉపక్రమించింది. మార్చి 31 నాటికి ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటించాలన్న లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు.
జిల్లాలో సుమారు లక్షా 50 వేల మరుగుదొడ్లు నిర్మించారు. ఇంకా 43 వేల 992 నిర్మాణాలు మార్చి 31వరకు పూర్తి అవుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిర్దేశించిన ప్రకారం నిర్మించలేదని అధికారులు బిల్లులు చెల్లించలేదు. అందుకే చాలా మంది ఇప్పటికీ ప్రారంభించలేదు. ప్రజలకు అవగాహన కల్పించడంలో గ్రామకార్యదర్శుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది. 40కోట్ల నిధులు ఖాతాల్లో మూలుగుతున్నా... లబ్ధిదారులకు మాత్రం చేరడం లేదు.
స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా... ఇప్పటికీ 43వేల మరుగుదొడ్లు నిర్మించాల్సి రావడంతో కలెక్టర్ రొనాల్డ్ రోస్ ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఉన్నతాధికారులకు మండలాల బాధ్యత అప్పగించారు. గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలు, అంగన్ వాడీలు, ఆశా కార్యకర్తలు, క్షేత్ర సహాయకులతో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు 10 నుంచి 20 మరుగుదొడ్లు పూర్తి చేయించాలని ఆదేశించారు. 150 మంది మహిళలకు తాపీ మేస్త్రీలుగా శిక్షణ ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు.
ఇదీ చదవండి:భగీరథ నీటి వృథా