KTR Speech in Assembly: భవన నిర్మాణ క్రమబద్ధీకరణపై కోర్టు కేసు ఉందని.. అది పరిష్కారం కాగానే ప్రక్రియ పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఈ పద్ధతిలో లోపాలు ఉంటే సరిదిద్దుతామని చెప్పారు.
ఒకవేళ నిర్ణీత గడువులో అనుమతులు రానట్లయితే ఆటోమేటిక్‌గా అనుమతి ఇచ్చినట్లేనని కేటీఆర్ తెలిపారు. భవన నిర్మాణ అనుమతులను టీఎస్ బీపాస్‌కు అనుగుణంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. 2015-16లోనే జీవో నెంబర్ 58, జీవో నెంబర్ 59 తీసుకొచ్చి ఉచితంగా, కనీస ఛార్జీలతో క్రమబద్ధీకరించామన్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే దాదాపు లక్ష పైచిలుకు పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. శాసన మండలి సభ్యుల కోరిక మేరకు రాష్ట్రంలో గతేడాది 2022లో కూడా క్రమబద్ధీకరించుకోవడానికి ఈ జీవోల ద్వారా అవకాశం కల్పించామన్నారు.
గృహ నిర్మాణ శాఖ రద్దు చేసుకున్నామని.. ఇకపై రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని వివరించారు. 84 గ్రామాల తీర్మానం చేసి 111 జీవోను తొలగించి 69 జీవో తెచ్చామన్నారు. 1920లో కట్టిన హిమాయత్‌సాగర్ కాలుష్యం బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: