కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు ఉపయోగపడేవి అయితే వారు ఎందుకు సంబురాలు చేసుకోవడం లేదని మంత్రి కేటీఆర్ భాజపా నాయకులను ప్రశ్నించారు. తాజా పరిమాణాలపై కేటీఆర్ ట్వీట్ చేశారు. రెవెన్యూ బిల్లును తెలంగాణ చట్టసభలు ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబురాలు జరిగాయని... రైతులోకం పూర్తిస్థాయిలో హర్షించిందని పేర్కొన్నారు.
కేంద్ర వ్యవసాయ బిల్లులు రైతులకు ప్రయోజనకరమైనవైతే ఎన్డీయే మిత్రపక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయన్నారు. కొవిడ్ మహమ్మారిపై పోరాటానికి కేంద్రం రూ. 7వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందని భాజపా ఎంపీలు చెప్తున్నారు కానీ... అదే సమయంలో రూ. 290 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిందని మంత్రి తెలిపారు. అసత్యాలతో తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: దేశంలో ఎక్కడైనా రైతు పంటను అమ్ముకోవచ్చు: భాజపా ఎంపీలు