అత్యధిక వ్యవసాయ రుణాలు మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచినట్లు ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలుస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మెుత్తం 27 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినట్లు వెల్లడించారు. జీఎస్డీపీలో వ్యవసాయం పాత్ర 300 రెట్లు పెరిగి.. తలసారి ఆదాయం రెట్టింపైందన్నారు. అప్పులు ఉన్నాయని గొంతులు చించుకున్న వారికి ఇవి కనపడవా అని ప్రశ్నించారు.
రుణమాఫీ, రైతుబంధులో సింహభాగం చిన్న, సన్నకారు రైతులకే చేరడం సంతృప్తి ఇచ్చిందని తెలిపారు. దుబ్బాకలో గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భాజపా సామాజిక మాధ్యమాల్లోనే ఉంటుందని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు సవాల్ చేస్తే సమాధానం చెప్పే ధైర్యం భాజపాకు లేదని ఆరోపించారు. కాంగ్రెస్ గల్లీ నుంచి దిల్లీ వరకు ఖాళీ అయిందని విమర్శించారు.
కరోనా నియంత్రణలో తెలంగాణ పనితీరు బాగా ఉందని సంస్థలు నివేదిక ఇచ్చాయని పేర్కొన్నారు. ఎనిమిది త్రైమాసికాల నుంచి జీడీపీ క్షీణిస్తూ వచ్చి కరోనాతో సున్నాకు చేరిందని విమర్శించారు. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థను, ఉపాధి అవకాశాలను కేంద్రం దెబ్బతీసిందని అన్నారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందో భాజపా నేతలు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని అడిగి మూడేళ్లైనా 3 పైసలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నలుగురు భాజపా ఎంపీలు వారి పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక్క పైసా అయినా అదనంగా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. సుదీర్ఘ కృషి వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని.. 80 శాతానికి పైగా ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడనేది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని.. చట్టం ప్రకారం నవంబర్ 11 తర్వాత ఎప్పుడైనా రావొచ్చని కార్పొరేటర్లకు చెప్పానని మంత్రి కేటీఆర్ వివరించారు.
ఇదీ చూడండి : 'కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు'