కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ కలిగించిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆర్థిక సర్వే పేర్కొన్నప్పటికీ... తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా తగ్గించడం వల్ల... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రభావం చూపనుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 2019-20 ఆర్థిక సంవత్సరంలో అనూహ్యంగా 18.9 శాతానికి తగ్గడం.. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను చాలా బలహీనంగా నిర్వహిస్తుందనడానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడం దురదృష్టకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.