KTR on 9 Medical Colleges Opening Telangana 2023 : తొమ్మిది వైద్య కళాశాలల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని.. 20,000 మందితో ర్యాలీ జరిపి కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పురపాలకశాఖ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ నెల 15న జనగాం, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మంలో నూతన మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి.
ఏకకాలంలో తొమ్మిది కళాశాల ప్రారంభోత్సవం జరగనుంది. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి కేటీఆర్.. ప్రారంభోత్సవాన్ని (KTR on 9 Medical Colleges Opening) ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకచోట కళాశాలను ప్రారంభిస్తారని.. కామారెడ్డి కాలేజీ ప్రారంభంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో 20,000 మందికి తగ్గకుండా భారీ ర్యాలీలు నిర్వహించాలని వివరించారు. ఇందులో శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొనాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
జులైలో 9 వైద్య కళాశాలలు ప్రారంభిస్తాం: హరీశ్‌రావు
New Government Medical Colleges Telangana 2023 : జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్న.. మొట్టమొదటి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనుందని కేటీఆర్ పేర్కొన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుతో ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పారు. అనుబంధంగా ఉండే ఆసుపత్రితో అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రారంభంతో వచ్చే ప్రయోజనాలను.. ప్రజలకు తెలిసేలా కార్యక్రమంలో పెద్దఎత్తున యువత, విద్యార్థులను భాగస్వాములను చేయాలని కేటీఆర్ సూచించారు.
తెలంగాణ ఆహార ఉత్పత్తిలోనే కాకుండా.. దేశ ఆరోగ్యానికి కీలకమైన వైద్యుల తయారీలోనూ అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో రాష్ట్రానికి దక్కింది.. కేవలం రెండు వైద్య కళాశాలలు మాత్రమేనని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే 157 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది శూన్యమని ఆక్షేపించారు. వైద్య కళాశాలల ఏర్పాటు విషయంలో హస్తం పార్టీ, బీజేపీ వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు తీరని అన్యాయం చేసిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని కేటీఆర్ సూచించారు.
తెలంగాణ వైద్యవిద్యలో నూతన శకం.. ఒకేసారి 8 వైద్య కళాశాలలు ప్రారంభం
Harish Rao on 9 Medical Colleges Opening Telangana : భారతదేశంలో అతి ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు కలిగిన రాష్ట్రంగా.. తెలంగాణ నిలిచిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు (Harish Rao on 9 Medical Colleges Opening) తెలిపారు. ప్రతి లక్ష జనాభాకు.. 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 2014లో ఈ విషయంలో చిట్టచివరి స్థానంలో ఉన్న తెలంగాణ.. నేడు అగ్రస్థానానికి చేరిందని అన్నారు. ఇంతకు ముందు రాష్ట్ర విద్యార్థులు వైద్యవిద్య కోసం పక్క రాష్ట్రాలు మొదలు ఉక్రెయిన్, రష్యా వంటి విదేశాలకు వెళ్లి అనేక కష్టాలు పడేవారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
Harish Rao on MBBS Seats in Telangana : తెలంగాణ పిల్లలు రాష్ట్రంలోనే ఎలాంటి కష్టం లేకుండా.. వైద్యవిద్య అభ్యసించే గొప్ప సౌకర్యాన్ని సీఎం కేసీఆర్ కల్పించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. కొత్త వైద్య కళాశాల ఏర్పాటుతో అందుబాటులోకి వచ్చిన నూతన వైద్యసౌకర్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ వచ్చిన రోజు కేవలం ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవని.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం తెలంగాణలోనే పెరిగాయని హరీశ్‌రావు వెల్లడించారు.
Medical Reservation Seats : ఇకపై వంద శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే