హైదరాబాద్ నగరంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించి పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లో నిర్మిస్తున్న పై వంతెనతో పాటు దుర్గం చెరువు పై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులను తనిఖీ చేశారు. త్వరితగతిన పనులను పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సంబంధిత శాఖల మధ్య సమన్వయం గురించి ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ట్రాన్స్ కో విద్యుత్ లైన్ల తరలింపు, నూతన విద్యుత్ టవర్ల నిర్మాణం వంటి పెండింగ్ పనుల గురించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు.
ఇంజినీర్లతో పనులపై సమీక్ష
రెండు వారాల్లోగా ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన మేరకు విద్యుత్ లైన్లను తరలిస్తామని విద్యుత్ అధికారులు మంత్రికి వెల్లడించారు. బ్రిడ్జిని నిర్మిస్తున్న ఎల్.అండ్.టి ఇంజినీర్లతో పనుల ప్రగతి వివరాలను తెలుసుకున్నారు. బ్రిడ్జి పనులు దాదాపు పూర్తి అయినట్లు అధికారులు స్పష్టం చేశారు.
త్వరలో నిర్మాణ పనులు పూర్తి
నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నందున, సుందరీకరణ, లైటింగ్, పాదచారుల బాటల ఏర్పాటు పనులను మొదలుపెట్టాలని కాంట్రాక్ట్ ఏజెన్సీకి మంత్రి సూచించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత దానికి అనుసంధానంగా రోడ్ నెం-45 వరకు చేపట్టిన రోడ్డు పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
"దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పూర్తయితే పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ చాలా వరకు తగ్గుతుందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్లతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జితో హైదరాబాద్ నగరానికి మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు"
ఇవీ చూడండి: హైదరాబాద్‌లో కరోనా కేసు... రేపు మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష