KTR Inaugurated Ferring pharma: రాష్ట్రంలో 2030 కల్లా లైఫ్‌సైన్సెస్ రంగాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని అన్నారు. జీనోమ్ వ్యాలీలో ఫెర్రింగ్ ఫార్మా కంపెనీ ఔషధ ప్రయోగశాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో 110 మంది ఉద్యోగాలు దక్కుతాయని కేటీఆర్ తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. భారత్ సీరం వ్యాక్సిన్స్ సంస్థ 200కోట్లతో జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు అంగీకరించిందని కేటీఆర్ ప్రకటించారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులతో జీనోమ్ వ్యాలీ లైఫ్‌సైన్సెస్ రంగానికి గమ్యస్థానంగా నిలుస్తోందని కేటీఆర్ వివరించారు.
'ఫెరింగ్ ఫార్మా యూనిట్‌ను మొదట మహారాష్ట్రలో ఏర్పాటు చేద్దామనుకుని తర్వాత హైదరాబాద్‌కు మార్చారు. పరిశోధనా రంగంలో ప్రపంచ సంస్థలను ఆకర్షిస్తున్న లైఫ్‌సైన్సెస్ అనుకూల వాతావరణం, ప్రభుత్వ విధానాలకు ఇది నిదర్శనం. జీనోమ్ వ్యాలీ దేశంలోనే గాక ప్రపంచ లైఫ్‌సైన్సెస్ రంగానికే పవర్‌హౌజ్‌గా ఎదుగుతోంది. వివిధ రంగాల్లో రూ.7,500కోట్ల పెట్టుబడులను వస్తే అందులో సగానికి పైగా లైఫ్‌సైన్సెస్ రంగంలోనే ఉండటం సంతోషకరం. వచ్చే దశాబ్దం లైఫ్‌సైన్సెస్ రంగానిదే. రానున్న రోజుల్లో లైఫ్ సైన్సెస్ రంగం మరింత పురోగమించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.' -కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
ప్రపంచంలోని ఉన్నత ప్రమాణాలతో జీనోమ్ వ్యాలీ నడుస్తోందని కేటీఆర్ అన్నారు. త్వరలో జీనోమ్ వ్యాలీలో మరిన్ని ప్రముఖ సంస్థలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయత్వంలో ఈ రంగాన్ని మరింత ప్రోత్సహిస్తూ.. హైదరాబాద్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం 50 బిలియన్లు(5000 కోట్లు)గా ఉన్న లైఫ్ సైన్సెస్ రంగాన్ని 2030కల్లా 100 బిలియన్ల(10,000 కోట్లు)కు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులతో పాటు పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి: KTR Davos tour : దావోస్‌కు మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్
Dharani Portal : ధరణి పోర్టల్‌తో అయిదేళ్లుగా అవస్థలు
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్