తెలంగాణ రాష్ట్ర సమితి సాంకేతిక విభాగం నూతన కార్యాలయాన్ని తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రారంభించారు. గత ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించేందుకు.. తెరాస సామాజిక మాధ్యమాల కార్యకర్తలు చేస్తున్న కృషి అనితర సాధ్యమని ఆయన కొనియాడారు.
పార్టీకి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యకలాపాలను 2013 నుంచి సాంకేతిక విభాగం నిర్వహిస్తోందన్న కేటీఆర్.. సభ్యత్వ, కమిటీల డేటా బేస్, ఇతర అప్లికేషన్లు, పార్టీ వెబ్ సైట్, సామాజిక మాధ్యమాల నిర్వహణ జరుగుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో టెక్ సెల్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు.
సామాజిక మాధ్యమాల విభాగంలో తెరాస కన్వీనర్లుగా క్రిషాంక్, జగన్, సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి వ్యవహరిస్తారని ప్రకటించారు. ఏ పార్టీకి లేనంత మంది స్వచ్ఛంద సైనికులు సోషల్ మీడియాలో తెరాసకు ఉన్నారన్న కేటీఆర్.. ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని వారంతా బలపరుస్తున్నారని వివరించారు. పార్టీ సాంకేతిక విభాగం ద్వారా చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై కన్వీనర్లకు మంత్రి కేటీఆర్ సూచనలు చేశారు.
ఇదీ చూడండి : 'హైదరాబాద్లోని ఆ ప్రాంతాల్లో నీళ్లు రావు'