గ్లోబరీనా సంస్థకు తన మద్దతు ఉందన్న ప్రచారం పూర్తిగా అవాస్తమని... ఇంటర్ ఫలితాల వివాదం తలెత్తే వరకూ ఆ పేరే వినలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంటర్ ఫలితాల్లో తప్పులకు బాధ్యులైన వారిని ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్ర ఆవేదన కలిగించాయని... ఒక తండ్రిగా బాధను అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. ఇంటర్ బోర్డును రద్దు చేసి.. పన్నెండో తరగతి వరకు ఒకే గూటికి చేర్చాలన్న ఆలోచనలపై నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలివేస్తున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో నెటిజన్లు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు.
రాజ్యాంగేతర శక్తి ఎలా అవుతుంది
ప్రభుత్వంలో ఓ హోదా లేకపోయినప్పటికీ.. సర్కారు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని.. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారా అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ వివరణ ఇచ్చారు. సమస్యలను పరిష్కరించాలని... ఓ ప్రజా ప్రతినిధిగా అధికారులను కోరితే తప్పేంటని... దానివల్ల ఎవరికి ఇబ్బందని కేటీఆర్ ప్రశ్నించారు. నిజామాబాద్లో రైతుల నామినేషన్ల వెనుక... భాజపా, కాంగ్రెస్ రాజకీయాలు ఉన్నాయని ఆరోపించారు. కేంద్రంలో రాబోయే స్నేహపూర్వక ప్రభుత్వం ద్వారా... పసుపుబోర్డును సాధిస్తామన్నారు. నిజామాబాద్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని... రాష్ట్రంలో 16 స్థానాల్లో విజయం తెరాసదేనని ధీమా వ్యక్తం చేశారు.
మా వాళ్లను చేర్చుకున్నారు కదా
తెరాసలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చేరికలపై ఆరోపణలకు స్పందిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు, ఓ ఎంపీని చేర్చుకున్నారన్నారు. ఏపీ రాజకీయాలపై తనకు ఆసక్తి తక్కువన్న కేటీఆర్... ఎవరు సీఎం అనేది అక్కడి ప్రజలే తేలుస్తారని... మొత్తం మీద ఏపీ ఎమ్మెల్యేనే ఎవరో ఒకరు అవుతారని చమత్కరించారు. కేఏ పాల్ ప్రచారం వినోదాన్ని పంచిందని వ్యాఖ్యానించారు.
ఇవే మా ప్రాధాన్యాలు
సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం... విద్య, వైద్య ప్రమాణాలను పెంచడం... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాలు మెరుగుపరచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలని కేటీఆర్ వివరించారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండలో సాగునీటి ప్రయోజనాలు కల్పించే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు సర్కారు ప్రాధాన్యాంశాల్లో ఒకటన్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలను మెరుగుపరిచేందుకు నిరంతరం చర్యలు కొనసాగుతున్నాయని.. ఆస్పత్రుల్లో కాన్పులు 40 శాతం పెరగడమే దీనికి నిదర్శనమన్నారు. ఓ వైపు ప్రభుత్వ విద్యాసంస్థలను మెరుగుపరుస్తామంటున్నారని.. మరోవైపు ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న మల్లారెడ్డిని ప్రోత్సహిస్తున్నారని... ఇది వైరుద్ధ్యం కాదా అన్న ప్రశ్నకు స్పందిస్తూ... మల్లారెడ్డి ప్రజలు ఎన్నుకున్న నాయకుడని.. దానిలో వైరుద్ధ్యమేముందన్నారు.
ఇదీ చదవండి : ఒక తండ్రిగా ఆ బాధ నాకు తెలుసు: కేటీఆర్