Komatireddy letter to Cm kcr: నేలతల్లిని నమ్ముకుని బతుకుతున్న రైతన్నలను వేధించడం సరికాదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రైతన్నలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం... వారిపై కక్ష సాధించడం న్యాయం కాదన్నారు. రాష్ట్రంలో రైతులకు కరెంట్ కోతలు విధించడం, ఎరువుల ధరలు పెంచడంపై ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో రైతుల బాధలు వివరించారు. ఇప్పటికే వడ్ల కొనుగోలు విషయంతో రైతులు గందరగోళంలో ఉన్నారని... ఇప్పుడు చేతికొచ్చిన పంటకు నీరందించకుండా కరెంట్ కోతలు విధించడం సరికాదన్నారు.
పట్టణ ప్రాంతాలకు 24 గంటల కరెంటు ఇస్తూ రైతులకు కోతలు విధించడం సబబుకాదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. అవసరమనుకుంటే పట్టణ ప్రాంతంలో 2 గంటలు కోత విధించి రైతులకు మేలు చేయాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజు వారీగా 35 మిలియన్ యూనిట్లు రికార్డ్ కాగా 5 మిలియన్ యూనిట్లు కోత విధించారని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంట్‌కి అలవాటు చేసి ఇప్పుడు కోతలు విధించడమేంటని ప్రశ్నించారు. ఎరువుల ధరల రేట్లు పెంచడం రైతులకు భారంగా మారుతుందన్నారు. ఇలా ఓ వైపు ఎరువుల ధరలు పెంచుతూ కరెంట్ కోతలు విధిస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'మే నెలలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణ ప్రారంభం'