కేంద్ర మంత్రి వర్గంలో ప్రధాని మోదీ సామాజిక సమతుల్యాన్ని పాటించారని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఏపీలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని విపక్షాలు అడ్డుకున్నాయన్నారు.
"ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే కొత్త వ్యవసాయ చట్టాలు అమలు చేస్తున్నాం. ఎగుమతులు ప్రోత్సహించడం, రైతు తనకు నచ్చిన చోట అమ్ముకోవటమే చట్టాల లక్ష్యం. రాజకీయ కోణంతో కొన్ని సంఘాలు, పార్టీలు కొత్త చట్టాలను అడ్డుకుంటున్నాయి. మరోవైపు.. బీసీ రిజర్వేషన్ల పై రాజ్యాంగ సవరణ చేశాం. చట్టబద్దమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత మోదీకి దక్కుకుంది. ప్రధాని సాహసోపేత నిర్ణయంతో బీసీలకు కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు దక్కుతున్నాయి. ఇక.. జనాభా ఎక్కువున్న దేశంలో కరోనాను ఎదుర్కోవడం కత్తిమీద సామే. అయినా.. దేశంలో ఆక్సిజన్, ఇంజక్షన్ల కొరత లేదు. కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి వేగంగా జరుగుతోంది. ప్రొటోకాల్ ప్రకారం కరోనాను దీటుగా ఎదుర్కోవాల్సి ఉంది. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే ప్రజల సహకారం కావాలి."
-కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి
ఇదీ చదవండి: KISHAN REDDY: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి