Kishan Reddy Comments on BRS : ఈ నెల 27న ఖమ్మంలో నిర్వహించే.. రైతు గోస - బీజేపీ భరోసా బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన.. విజయవాడకు చేరుకుని హెలికాప్టర్‌లో భద్రాచలంకు చేరుకుంటారని చెప్పారు. అక్కడ సీతారామచంద్రుల వారిని దర్శించుకుంటారని వివరించారు. అనంతరం ఖమ్మంలో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే సభలో అమిత్ షా పాల్గొంటారని.. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో కిషన్‌రెడ్డి (Kishan Reddy) వివరించారు.
ఈ క్రమంలోనే తెలంగాణలో సమగ్రమైన పంటల బీమా పథకం అమలు చేయకపోవడంతో.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కిషన్‌రెడ్డి వివరించారు. అన్నదాతలకు ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీని బీఆర్ఎస్ సర్కారు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు ఓట్ల కోసం.. బీఆర్ఎస్ (BRS) సర్కార్ రుణమాఫీ పేరుతో కర్షకులను మోసం చేస్తుందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.
లక్షలాది కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని కిషన్‌రెడ్డి తెలిపారు. సకల సమస్యలకు రైతుబంధు పరిష్కారం కాదని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని ఆక్షేపించారు. తొలి మంత్రివర్గంలో మహిళా లేకుండా ఐదేళ్లు పాలించిన ముఖ్యమంత్రికి.. కేంద్రాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన 115 అభ్యర్థుల్లో.. కేవలం ఏడుగురు మాత్రమే మహిళలు ఉన్నారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు సముచిత స్థానం దక్కిందని కిషన్‌రెడ్డి అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప చిత్రాలకు అవార్డుల పంట పండిందని చెప్పారు. అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడు అవార్డు రావడం హర్షణీయమని.. ఆయనకు తన అభినందనలు తెలియజేస్తున్నట్లు వివరించారు. పుష్ప తెలుగుతో పాటు అనేక భాషల్లో ప్రజాదరణ పొందిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రబృందానికి కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
"రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారు. వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇవ్వడం లేదు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం రుణమాఫీ పేరుతో మోసం. సకల సమస్యలకు రైతుబంధు పరిష్కారం కాదు. మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు. కేసీఆర్ కుటుంబం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు. తొలి మంత్రివర్గంలో మహిళ లేకుండా ఐదేళ్లు పాలించారు. బీఆర్ఎస్ ప్రకటించిన 115 అభ్యర్థుల్లో.. కేవలం ఏడుగురు మాత్రమే మహిళలు ఉన్నారు." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Kishan Reddy Khammam District Tour : 'కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలన చూశాం.. బీజేపీకి అవకాశం ఇవ్వండి'