Kishan Reddy Fires on KCR : కేసీఆర్‌కు రాజకీయపరమైన ఆలోచన తప్ప.. ప్రజలపై చిత్తశుద్ధి లేదని కేంద్ర మంత్రులు ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఫామ్‌హౌస్ ఇంజినీర్‌గా మారిపోయారని ఎద్దేవా చేశారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కైలాశ్ చౌదరి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
కృష్ణా జలాల ట్రైబ్యునల్ (Krishna Water Tribunal) ఏర్పాటుకు ఆలస్యం కావడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy ) అన్నారు. రైతుల సంక్షేమం కోసం.. కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే ఆరింతలు ఎక్కువగా బడ్డెట్ కేటాయించిందని పేర్కొన్నారు అవినీతి కుంభకోణాలు లేకుండా, రాజకీయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.7 లక్షల కోట్ల అప్పు ఇచ్చిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
Kishan Reddy Fires on KCR : 'ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు'
అన్నదాతలు తమకు అండగా నిలవాలని.. రైతు రాజ్యం తీసుకువస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. నరేంద్ర మోదీ (Narendra Modi) రాకముందు అన్ని రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉండేవని.. కానీ ఇప్పుడు దేశంలో సరిపడా విద్యుత్ ఉందని తెలిపారు. గతంలో డబ్బులు ఇచ్చి యూరియా కొనాలన్నా క్యూ ఉండేదని.. చెప్పులు, బ్యాగులు పెట్టి లైన్లలో ఉండేవారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని.. యూరియా కొరత లేని భారత్‌గా ప్రధాని తీర్చిదిద్దారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఒక ఎకరా ఉన్న రైతుకు కేంద్రం ఎరువులపై రూ.20,000 సబ్సిడీ ఇస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయ పరమైన ఆలోచన తప్ప.. ప్రజలపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కుమారుడిని సీఎం చేయడమే కేసీఆర్ ఏకైక లక్ష్యమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు, విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అప్పు ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 11 ప్రాజెక్టులను పూర్తి చేయాలని.. అందుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మోదీ చెప్పారని గుర్తు చేశారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అది ఓట్ల కోసం కాదని కిషన్‌రెడ్డి వివరించారు.
"కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్రం అప్పు ఇచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్రం రూ.7 లక్షల కోట్ల అప్పు ఇచ్చింది. రాష్ట్రంలోని 11 ప్రాజెక్టుల పూర్తికి ప్రధాని సహకరిస్తామన్నారు. రాజకీయ ఆలోచన తప్ప కేసీఆర్‌కు ప్రజలపై చిత్తశుద్ధి లేదు. కుమారుడిని సీఎం చేయడమే కేసీఆర్ ఏకైక లక్ష్యం." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Bandi Sanjay Comments on KCR : రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అని మోసం చేస్తున్నారని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కైలాశ్ చౌదరి (Kailash Choudhary) ఆరోపించారు. తెలంగాణాకు అందాల్సిన నీళ్లు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వడ్ల కొనుగోలు టెండర్ల పేరుతో మరో రూ.500 కోట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమైయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మురళీధర్ రావు, ప్రేమేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.