రాష్ట్రంలో పంటలు, ఆహార అవసరాలపై పది రోజుల్లో క్షేత్రస్థాయి ద్వారా కచ్చితమైన సమాచారం సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. పంట కాలనీలు ఏర్పాటు చేయాలని సూచించారు. బియ్యం, పండ్లు, కూరగాయలు ఎగుమతి చేసే పరిస్థితి రావాలన్నారు. మార్కెటింగ్ శాఖ కర్షకుల నుంచి నేరుగా కొనుగోళ్లు చేయాలని చెప్పారు. పసుపు, కారం పొడులు, నువ్వుల నూనెలు వంటి వాటిని మహిళా సంఘాల ద్వారా తయారు చేయించి వారికి ఉపాధి కల్పించాలని సూచించారు.
1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు
రాష్ట్రంలో కోటీ పాతిక లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా నీటి పారుదల రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని.. రాబోయే రోజుల్లో పంట దిగుబడులు భారీగా పెరుగుతాయని కేసీఆర్ అన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించేలా వ్యూహాన్ని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని అన్నారు.
ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి
ఇతర రాష్ట్రాల నుంచి నగరాలకు పంటలు దిగుమతి అవుతున్నాయని.. ఈ దుస్థితి మారి మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని సూచించారు. గతంలో గ్రామాల నుంచి పట్టణాలకు తీసుకొచ్చి అమ్మేవారని ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి నగరాలకు దిగుమతి చేసుకుని గ్రామాల్లో అమ్ముతున్నారని అన్నారు. పంజాబ్ సహా వరిసాగు బాగా జరిగే ప్రాంతాల్లో అధికారులు పర్యటించి మెలుకువలు నేర్చుకుని, రైతులకు నేర్పించాలని సూచించారు.
ప్రజల్లో అవగాహన పెంచాలి
ప్రజలు తినే ఆహారం విషయంలో అవగాహన పెంచి మంచి కల్తీ లేని ఆహార పదార్థాలు తినేలా ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసే పండ్లకు మన రాష్ట్రంలో అనువైన ప్రాంతాన్ని గుర్తించి వాటిని సాగు చేసేలా ప్రోత్సహించాలని అన్నారు.
మహిళా సంఘాలకు అవకాశం
పసుపు, కారం పొడులు, కందిపప్పు, పల్లి, నువ్వుల నూనెలను మహిళా సంఘాల ద్వారా తయారు చేయించాలని ముఖ్యమంత్రి తెలిపారు. దీనివల్ల మహిళలకు ఉపాధి దొరకుతుందని అన్నారు. కల్తీ సరుకులు కొనే బాధ వినియోగదారులకు తప్పుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతీ నియోజకవర్గంలో ఆగ్రానమీ శిక్షణా కేంద్రాలు, విశ్వవిద్యాలయం ఆగ్రానమీ కన్సల్టెన్సీని పెట్టాలని సూచించారు.
ఇదీ చదవండి : 'మద్దతు ధరకు వ్యూహం రూపొందించండి'