గచ్చిబౌలి హెచ్సీయూ డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ పౌరహక్కుల నేత ఆచార్య హరగోపాల్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగ సంఘాల నేతలు సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ అప్పుల్లో ఉందని చెప్పడం సిగ్గుచేటని హరగోపాల్ విమర్శించారు. వ్యాపార సంస్థల్లో లాభనష్టాలు ఉంటాయి కానీ... ప్రభుత్వరంగ సంస్థల్లో లాభనష్టాలుండవన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో యూనియన్లు పెట్టుకోవడానికి వీలు లేదనడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి కానీ తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికులు నెలరోజుల ముందే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా... కనీసం చర్చలకు పిలిచిన పాపాన పోలేదన్నారు. కేవలం హైకోర్టు ఆదేశాలతో చర్చలకు పిలిచి... యూనియన్ నాయకుల చరవాణులు లాక్కుని నలుగురిని మాత్రమే అనుమతించడం అమానుషం అన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లపై చర్చించి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆచార్య హరగోపాల్ ప్రకటించారు.
ఇవీ చూడండి: హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం