విహారయాత్ర విషాద యాత్రగా మిగిలిపోయింది. గోవాలో సంతోషంగా విహారయాత్ర ముగించుకుని వస్తున్న తరుణంలో శ్రీరంగపట్నం-బీదర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సరుకు రవాణా వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాతపడ్డారు. కర్ణాటక రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలను హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు మృతదేహాలను తరలించారు. మృతులంతా రెండు కుటుంబాలకు చెందినవారు.
అల్వాల్ బంజారా కాలనీకి చెందిన అర్జున్ కుమార్ (36), అతని భార్య సరళాదేవి (34), కుమారుడు వివాన్(3), మేనత్త అనిత (58)ల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అర్జున్ సోదరుడు అమెరికా నుంచి వచ్చేంతవరకు మృతదేహాలు ఆసుపత్రిలోనే ఉంచుతామని అర్జున్ కుటుంబసభ్యులు తెలిపారు. అంత్యక్రియలు రేపు నిర్వహిస్తామన్నారు.
ఇదే ఘటనలో చనిపోయిన మరో కుటుంబానికి చెందిన గోడే కీ కబర్‌కు చెందిన రవళి (30), భర్త శివకుమార్ (35), పెద్ద కుమారుడు దీక్షిత్ (11) మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి గోడే కీ కబర్‌కు తీసుకువెళ్లారు. మృతదేహాలకు ఎమ్మెల్యే రాజాసింగ్ నివాళులు అర్పించారు. మరికొద్దిసేపట్లో ఈ మూడు మృతదేహాలకు పురానాపూల్లోని స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.