హైదరాబాద్ జేఎన్టీయూలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. కళాశాలలోని ప్రిన్సిపల్ గదిలోనే సందీప్ అనే విద్యార్థి తన ఒంటి మీద పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించాడు. సహచర విద్యార్థులు అడ్డుకోగా... ఎలాంటి ప్రమాదం జరగలేదు. 15 రోజుల క్రితం సీనియర్ విద్యార్థులు తనను ర్యాగింగ్ చేశారని ప్రిన్సిపల్‌కు సందీప్ ఫిర్యాదు చేశాడు. అనంతరం సందీప్‌ను డిటెయిన్ చేస్తూ నోటీసులిచ్చింది.
ర్యాగింగ్ చేసిన వారిని వదిలేసి తనపై చర్యలు తీసుకున్నారని సందీప్ ఆరోపించాడు. ఫిర్యాదు ఇచ్చినందుకు తనపై పగతోనే డిటెయిన్ చేశారన్న మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు.. హాజరుశాతం తక్కువగా ఉన్న కారణంగానే.. సందీప్‌ను డిటెయిన్ చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు... సందీప్‌ను అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.