స్వల్పకాలిక వంగడాలకు భవిష్యత్తులో అధికంగా ఆదరణ ఉండనుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. ఆన్‌లైన్ వేదికగా జరిగిన విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి సాంకేతిక సదస్సుకు ఆయన అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఇక్రిశాట్ జన్యు శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ వర్షిణే, జాతీయ పత్తి పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్ వైజీ ప్రసాద్, వర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ ఆవిర్భావం తర్వాత అనతికాలంలో అనేక రంగాల్లో జాతీయ స్థాయిలో పేరుగాంచడం, సాధించిన పురోగతి, రైతుల సేవలో నిమగ్నమై కొత్త వండగాల విడుదల, వివిధ పంటలకు సంబంధించి జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిల్లో ఎదురవుతోన్న సవాళ్లు, ఇతర పరిశోధన, విస్తరణ వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
పర్యావరణ పరిరక్షణ, తరిగిపోతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో స్వల్ప కాలిక వంగడాల వినియోగం అత్యంత ఆవశ్యమని వీసీ చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నీటిపారుదల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా.. 80 శాతం సాగు భూమికి నీటి లభ్యత పెరగడంతో వరి ఉత్పత్తిలో తెలంగాణ.. దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల అవసరాలకు అనువుగా వరి పంటలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని.. తక్కువ గ్లైసిమికీ ఇండెక్స్, ప్రోటీన్లు తక్కువ ఉండే, బిర్యానీకి అనువైన బియ్యం కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఆ దిశగా పరిశోధనలు సాగాలన్నారు.
హైడెన్సిటీ వరి, యాంత్రీకరణ సాగు చేసే పత్తి రకాలు అభివృద్ధి దృష్ట్యా రూ.400 కోట్లతో వర్సిటీ మౌలిక సదుపాయాలు కల్పించిందని ప్రకటించారు. బోధన, పరిశోధన అంశాల్లో అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఇతర వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేస్తున్నాయని డాక్టర్ ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. ఇక్రిశాట్ అనేక అంశాల్లో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని రాజీవ్ వర్షిణే వెల్లడించారు.
ఇదీ చూడండి: ప్రేమిస్తున్నానంటూ వెంటపడి.. పెళ్లికి ఒప్పుకోలేదని గొంతుకోశాడు