ప్రకాశం జిల్లా నుంచి వచ్చి జనసేన పార్టీ శ్రేణులతో పవన్ కల్యాణ్ మంగళగిరిలో సమావేశమయ్యారు. వారి చెప్పిన అంశాలు శ్రద్ధగా విన్న ఆయన.. అన్ని విషయాలు గమనించే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. పదవులు, అధికారంపై ఆశ లేకుండా పాతికేళ్లు తనతో ప్రయాణానికి సిద్ధం కావాలని సూచించారు. నీతి, నిజాయతీ ఉండే రాజకీయ నాయకులు రావాలని అభిప్రాయపడ్డారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పార్టీని నడుపుతానని పునరుద్ఘాటించారు. మానవత్వం కోసం పరితపించే ఎవరినైనా అభిమానిస్తానని పవన్ తెలిపారు. పార్టీల కోసం దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టకూడదన్న ఆయన... జగన్, చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాల్లేవని స్పష్టం చేశారు.
అధికారం ఇస్తే అధికారులపై దాడులా ?
విశాఖలో జరిగిన కోడికత్తి కేసు ఏమైందని జగన్‌ను ప్రశ్నించారు. చిన్నాన్న హత్యకు గురైతే ఇప్పటికీ ఏమీ తేల్చలేక పోయారని ఎద్దేవా చేశారు. వివేకా హత్యలో ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్... అధికారంలోకి వచ్చాక వివేకా హత్య కేసును సీబీఐకి ఎందుకు అప్పగించలేదని నిలదీశారు. విచారణలో పురోగతి ఏదని అడిగారు. నెల్లూరులో మహిళా అధికారి ఇంటిపై ఎమ్మెల్యే దాడి చేశారన్న పవన్... ప్రభుత్వం నడిపేవారు హింసను ప్రోత్సహించకూడదని హితవు పలికారు.
151 సీట్లు ఇస్తే... కొడతారా?
కేసులు ఉండేవాళ్లు సమాజంలో బలంగా మాట్లాడలేరన్న పవన్.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడతారని వ్యాఖ్యానించారు. జగన్ దిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రాజెక్టులపై బలంగా మాట్లాడలేకపోయారని విమర్శించారు. సీఎం జగన్‌కు సీబీఐ కేసుల భయం ఉందన్న జనసేనాని... 151 సీట్లు ఇస్తే ప్రజాభిమానాన్ని పలుచన చేశారన్నారు. వైకాపాకు ఓట్లేసి తప్పుచేశామా అనే భావన జనంలో కలుగుతుందని తెలియజేశారు. అసెంబ్లీలో చర్చ జరగడం లేదన్న కల్యాణ్.. మాట్లాడితే కొడతారేమో అన్న దుస్థితి ఉందని విశ్లేషించారు.
ఇవీచూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన