NTR Centenary Celebration in Hyderabad : హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం అట్టహాసంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగనున్నాయి. నగరంలోని కూకట్‌పల్లి ఖైతాలపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభంకానున్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు.
Jai NTR Website Launch in Telangana : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులకు ఘనంగా సన్మానం చేయనున్నారు. అనంతరం తారకరాముడిపై వెబ్‌సైట్, ప్రత్యేక సంచిక ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌తో కలిసి పని చేసిన సీనియర్ నటీనటులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకలకు బాలకృష్ణ, కల్యాణ్‌రామ్, పవన్ కల్యాణ్, ప్రభాస్, రానా, రామ్‌చరణ్, అల్లు అర్జున్ హాజరు కానున్నారు.
Jr NTR Fails to Attend NTR Centenary Celebration in Hyderabad : తొలుత ఈ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతున్నట్లు తెలిసింది. కానీ తాజాగా తాను ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రాలేకపోతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల హాజరుకాలేనని తెలిపారు ఆహ్వానం ఇచ్చేటప్పుడే సావనీర్ కమిటీకి చెప్పినట్లు జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఖైత్లాపుర్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రత్యేక సంచిక, వెబ్‌సైట్ ఆవిష్కరణ, బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం రోజున శత జయంతి ఉత్సవాల ఛైర్మన్ టీడీ జనార్ధన్, నందమూరి రామకృష్ణ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, సినీ నటుడు మాజీ ఎంపీ మురళీమోహన్ పరిశీలించారు.
తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఇవాళ ఘనంగా నిర్వహిస్తున్నట్లు మురళీ మోహన్ తెలిపారు. ఈ కార్య్రక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ తారలు హాజరవ్వనున్నారని పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీ లోపు నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డును బహూకరించాలని ప్రధానమంత్రిని ఇదే వేదిక నుంచి డిమాండ్ చేయబోతున్నామని తెలియజేశారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ సమగ్ర సినీ, రాజకీయ జీవితం గురించి ప్రత్యేకంగా సంకలనం చేసిన 'శక పురుషుడు' ప్రత్యేక సావనీర్‌ను.. ఆయన సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర మొత్తం సమాచారాన్ని జై ఎన్టీఆర్ వెబ్‌సైట్‌లో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు.
విగ్రహ ఏర్పాటుకు కసరత్తు : మరోవైపు ఖమ్మం జిల్లాలోని లకారం చెరువులో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై విగ్రహం ఏర్పాటును నిరాకరిస్తూ.. హైకోర్టు కూడా స్టే విధించింది. అయితే ఇందుకు సంబంధించిన వివాదానికి ముగింపు పలికేందుకు విగ్రహ ఏర్పాటు కమిటీ పలు చర్యలకు ఉపక్రమించింది. లకారం చెరువులో ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్ విగ్రహాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఏర్పాటు చేసినట్లు నిర్వాహణ కమిటీ తెలిపింది.
అయితే ఖమ్మంలోనే మొదటగా ఈ సమస్య వచ్చిందని పేర్కొంది. అయినా యాదవ సంఘాలు మనోభావాలు దెబ్బతినకుండా వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటూ.. శ్రీకృష్ణుడి రూపంలో ఉండే కొన్ని ఆభరణాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పిల్లన గ్రోవి, నెమలి పింఛం, చక్రంను తొలగించామని వెల్లడించారు. ఎవరి మనోభావాలను అయినా నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నామని.. ఈనెల 28న ఎన్టీఆర్ మనవడు జూ. ఎన్టీఆర్ చేతుల మీదుగా విగ్రహాన్ని కోర్టు అనుమతితో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కేవలం ఎన్‌ఆర్‌ఐల దాతలు ఎవరైతే దాతలుగా ఉన్నారో వారు మాత్రమే ఆహ్వానితులుగా ఉంటారన్నారు. రాజకీయాలకు, కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం ఉంటుందని కమిటీ సభ్యులు వివరించారు.
ఇవీ చదవండి :