IT Raids On Vivek Venkata Swamy : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో మరోమారు ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయి. ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
IT Raids in Telangana Today : ఇక తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని సోమాజిగూడ, మంచిర్యాలలోని ఆయన నివాసాల్లో అధికారులు తనిఖీలు జరిపారు. బేగంపేటలోని వివేక్ కార్యాలయంలోనూ సోదాలు చేశారు. అయితే సోమాజిగూడలోని వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు నాలుగున్నర గంటల పాటు సోదాలు చేశారు. బ్యాంక్ ఖాతాలో రెండ్రోజుల క్రితం చేసిన నగదు బదిలీకి సంబంధించిన పత్రాలు పరిశీలించినట్లు తెలుస్తోంది.
IT Raids in Asifabad Today : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో ఏకకాలంలో వ్యాపారస్థుల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి వ్యాపారుల ఇళ్లల్లో ఉదయం 6 గంటల నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సుమారుగా 8 గంటల సమయం గడిచిపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ ఏ విషయం అనేది కొలిక్కి రాలేదు. ఐటీ సోదాలలో ఇప్పటివరకు ఏమేమి దొరికినాయో అంచనా వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఐటీ అధికారులు జిల్లాకు సుమారుగా 20 వాహనాలలో వచ్చినట్టు సమాచారం. ఐటీ అధికారులు చేస్తున్న దాడులతో ఆసిఫాబాద్ జిల్లాలోని బడా వ్యాపారస్థులు, కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
IT Raids in Karimnagar : కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం జమ్మికుంటకు చెందిన ఆదిత్య కాటన్ ఇండస్ట్రీస్‌తో పాటు మరో కాటన్ మిల్లు యజమానులు ముక్క నారాయణ, ముక్క శివన్న ఇళ్లల్లో సోదాలు చేశారు. అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఐటీ అధికారులు స్థానిక పోలీసు బందోబస్తుతో ఈ తనిఖీలు చేపట్టారు. ఐటీ సోదాలు చేస్తున్నారనే సమాచారం రావటంతో వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. సుమారు మూడు గంటల పాటు ఈ తనిఖీలు చేసినట్లు తెలిసింది.
Revanth Reddy Respond on IT Raids in Congress Leaders : మరోవైపు కాంగ్రెస్ నేతలపై ఐటీ సోదాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ నాయకుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ(IT Raids) తనిఖీలు దేనికి సంకేతమని ప్రశ్నించాారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇండ్లపై ఐటీ సోదాలు ఎందుకు జరగడం లేదు? అని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైందని.. ఆ సునామీని ఆపడానికి చేస్తున్న కుతంత్రమే ఇది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫీనిక్స్ సంస్థలో ఐటీ సోదాలు, ఏకకాలంలో 20 చోట్ల 30 బృందాల తనిఖీలు
Ponguleti Srinivas Reddy Interesting Comments : ఇటీవల పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఐటీ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే ఐటీ అధికారులు తనిఖీ చేసేందుకు ఆయన నివాసానికి వెళ్లడం గమనార్హం.ఈ నెల 9వ తేదీన ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఎనిమిది వాహనాల్లో వచ్చిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. మూకుమ్మడిగా ఇంట్లోకి ప్రవేశించి పొంగులేటితో సహా కుటుంబ సభ్యుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నందగిరిహిల్స్‌లో ఉన్న పొంగులేటి నివాసం, రాఘవ కన్‌స్ట్రక్షన్‌లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆరోజున నామినేషన్ వేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది.
Ponguleti Srinivas Reddy Responds on IT Raids : తనపై ఆదాయపన్ను శాఖ దాడులపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీలోకి రావాలని తనపై ఒత్తిడి చేశారని.. ఆ పార్టీలోకి రాలేదని, అదేవిధంగా హస్తం పార్టీ గ్రాఫ్ పెరిగిందని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే ఐటీ సోదాలు జరుగుతాయని తనకు తెలుసని.. తాను ఉహించినట్లే జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ఎజెండా ఒక్కటేనని.. తెలంగాణలో కాంగ్రెస్ గెలవకూడదని ప్రయత్నిస్తున్నారని పొంగులేటి విమర్శించారు.
ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు-ఈ పరిణామాలు దేనికి సంకేతం?
పొంగులేటిపై "ఐ" టీ దాడులు- నివాసాలు, కార్యాలయాల్లో రోజంతా ఆదాయశాఖ సోదాలు