రాష్ట్రంలో పెద్ద పరిశ్రమలతోపాటు క్షేత్రస్థాయిలో సూక్ష్మ శుద్ధి యూనిట్ల స్థాపనను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ పేర్కొన్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుపై ఔర్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభుత్వం మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. జయేష్ రంజన్ సమక్షంలో "మన ఆహారం" అంకుర కేంద్రం వ్యవస్థాపకులు బాల్‌రెడ్డి, టీఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ సుష్మ ధరసోత్... ఒప్పంద పత్రాలు స్వీకరించారు.
ప్రోత్సహిస్తాం..
రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల రాకతో సాగు నీరు, వనరులు అందుబాటులోకి వచ్చాయని జయేష్ పేర్కొన్నారు. దీని ద్వారా వరి, ఇతర పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. ఆ వ్యవసాయోత్పత్తులను ముడి సరకుగా అమ్మకుండా ప్రాసెసింగ్, ప్యాకింగ్, బ్రాండింగ్ చేసి విక్రయిస్తే రైతులకు మంచి ధరలు లభిస్తాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఔత్సాహిక యువత, రైతులు.. ప్రాథమిక ఆహార శుద్ధి యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకు వస్తే.. 'మన ఆహారం' అంకుర కేంద్రం, ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం