రాష్ట్రంలో ఎన్నికలు జరిగే పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ఉత్తర్వులను పురపాలకశాఖ జారీ చేసింది. 121 పురపాలక సంఘాలు, 10 నగరపాలక సంస్థల్లో ఈ నెల మూడో తేదీన ప్రారంభమైన పునర్విభజన ప్రక్రియను ముగిస్తూ వార్డులను నోటిఫై చేశారు. ఈమేరకు రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల వారీగా వార్డులను, వాటి పరిధిని ఖరారు చేస్తూ జీవో జారీ చేశారు. ఈ నెల 17న జారీ అయిన జీవోలు గురువారం అందుబాటులోకి వచ్చాయి. వార్డుల పునర్విభజనలో వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఎలాంటి పొరపాట్లకు అవకాశంలేకుండా ప్రక్రియను ముగించినట్లు పురపాలక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
వార్డుల వారీగా ఓటర్ల విభజన
వార్డుల పునర్విభజన ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో వాటికి సంబంధించిన గెజిట్‌లను ప్రచురించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించనున్నారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డులవారీగా ఓటర్ల జాబితాలను రూపొందిస్తుంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న ఓటర్ల జాబితాలను వార్డుల వారీగా విభజిస్తుంది. రిజర్వేషన్లు అందిన వెంటనే ఎన్నికలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ నియామకం