కేంద్ర ప్రభుత్వ రుణం పేరుతో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును మోసం చేసేందుకు ప్రయత్నించిన సంఘటనలో ఒక విలేకరి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అతనితోపాటు మరో యువకుడు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు సమాచారం. సదరు విలేకరి మహేష్ పేరుతో ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖలో డిప్యూటీ డైరక్టర్‌ను అంటూ నమ్మించడం, కేటీఆర్ పేరును ప్రస్తావించడంతోపాటు ఏకంగా ఎంపీ కేకేను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఈ కేసుపై బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రాథమిక దర్యాప్తులో భాగంగా కీలక అంశాలను గుర్తించారు. నిజామాబాద్ ప్రాంతంలోని ఒక విలేకరి ఈ వ్యవహారానికి మూలసూత్రధారిగా అనుమానిస్తున్నారు. కాగా కేకేకు ఫోన్ చేసిన నంబరు పనిచేస్తుండగా పోలీసులు సదరు మహేష్‌తో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన మోసం చేసి తీసుకున్న డబ్బులను తిరిగి బాధితుడు అఖిల్‌కుమార్ ఖాతాలో వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మరింతమంది ఎంపీలను సైతం ఇలాగే మోసం చేసి ఉంటారనే అనుమానంతో వారిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి: కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు