- పప్పీ.. స్నూపీ.. బ్రౌనీ.. టామీ అని.. ఇలా మీరు ముద్దుగా పిలుచుకుంటారు కానీ... మా శాస్త్రీయ నామం ఏంటో తెలుసా? కీనస్ లూపస్ ఫామిలేరియస్.
- మేం మీకు మంచి విశ్వసనీయ స్నేహితులం.
- ఆదిమ మానవుడు మొదట మచ్చిక చేసుకుంది మమ్మల్నే.
- మాకు వాసన పట్టే శక్తి చాలా ఎక్కువ. మీ కన్నా పదివేల రెట్లు ఎక్కువగా మేం వాసన పసిగట్టగలం. ఇదే మా అసలు సిసలు ప్రత్యేకత.
- అందుకే పోలీసు అంకుల్స్ దొంగలను పట్టుకోవడానికి మా సాయం తీసుకుంటారు.
- మేం మీలా అన్ని రంగులు చూడలేం. మేం ప్రధానంగా.. బూడిద, నీలం, పసుపు రంగులు మాత్రమే చూడగలం.
- వినికిడి శక్తిలో మాత్రం మేమే ఉత్తమం. మాకు మీ మనుషుల కన్నా.. పది రెట్లు ఎక్కువ వినే శక్తి ఉంటుంది.
- ఇటీవలే.. సైబీరియాలో 18వేల ఏళ్ల క్రితం చనిపోయినట్లుగా భావిస్తున్న ఒక కుక్కపిల్ల మృతదేహం పరిశోధకులు కనిపెట్టారు.
- ఇది పూర్తిగా మంచులో కూరుకుపోయి ఉండటం వల్ల ఇన్ని సంవత్సరాలైనా దీని శరీరం పాడవకుండా ఉంది.
- తోడేలు నుంచి కుక్కగా మారే పరిణామ క్రమంలో భాగంగా ఏర్పడ్డ జీవిగా దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని పళ్లు తోడేలు, కుక్క.. రెండింటినీ పోలి ఉన్నాయి.
- దీనికి డాగోర్ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఇది మా కుక్కలకు పూర్వీకుడు అని అభిప్రాయపడుతున్నారు!
- ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 రకాల కుక్కలున్నాయి.
- మేం అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటాం. కూరగాయలు, పప్పులు, గింజలు వంటి శాకాహారం, గుడ్లు, చికెన్, మటన్, చేపలు వంటి మాంసాహారమూ తీసుకుంటాం. మొత్తంగా మనుషులు ఏం తింటే.. మేమూ అవి తింటాం!
- మేం మా చెవుల్ని కదిలించడానికే 18 కండరాలుంటాయి.
- రెండు సంవత్సరాల పిల్లవాడికి ఎన్ని తెలివితేటలుంటాయో మాకూ అంత తెలివి ఉంటుంది.
- కొన్ని ప్రాంతాల్లో మేం మనుషులకు సంబంధం లేకుండా అడవుల్లోనూ పెరుగుతుంటాం. ఇందులో ఆఫ్రికన్ అడవి కుక్క, ఆస్ట్రేలియన్ డింగోలు చక్కగా వేటాడతాయి.
- మా జీవిత కాలం 10 నుంచి 15 సంవత్సరాలు.
- మీరు పెద్దైన తర్వాత మీకు 32 పళ్లుంటాయి. మాకేమో 42 పళ్లుంటాయి.
- మేం గంటకు 19 మైళ్ల వేగంతో పరుగెడుతుంటాం.
- మేం పుట్టినప్పుడు మా కళ్లు తెరుచుకోవు. మూడు వారాల తర్వాత మాత్రమే మేం ప్రపంచాన్ని చూడగలం.
- ప్రపంచం మొత్తం మీద దాదాపు 400 మిలియన్ కుక్కలున్నట్లు అంచనా!
- ఊబకాయం అనేది మీలాగే మాకూ వచ్చే ఓ జబ్బు!
- ‘ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుంది’ అంటారు కదా.. ఏటా ఆగస్టు 26న ప్రపంచ కుక్కల దినోత్సవం జరుపుతుంటారు.
- మీకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా?... మీ చేతి వేలి ముద్రలు ఏ ఇద్దరివీ ఒకేలా ఉండవో... మా ముక్కు ముద్రలు కూడా ఏ రెండు కుక్కలవీ ఒకేలా ఉండవు.
సరే ఫ్రెండ్స్.. ఇప్పటికే చాలా విషయాలు చెప్పాను. ఉంటాను మరి భౌ.. భౌ.. అదే బైబై!
సుమారు 15000 సంవత్సరాల క్రితం నుంచే మనుషులకు కుక్కలకు స్నేహం కుదిరింది. అప్పటి నుంచే మనుషులు కుక్కల్ని పెంచుకుంటున్నారు.