విద్యార్థుల శక్తి, సామర్థ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మదించి.. వారి సామర్థ్యానికి తగిన కెరీర్‌ను మార్గదర్శనం చేసేలా ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక పోర్టల్ రూపొందించింది. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు పోర్టల్ ద్వారా ఉచితంగా సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించి నివేదిక ఇవ్వనున్నారు. ఈ మేరకు క్యాంపస్ క్రాప్ అనే సంస్థతో కలిసి ఏర్పాటు చేసిన కెరీర్ పోర్టల్‌ను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రారంభించారు.
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలు విద్యార్థుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసుకుంటే ఈ నెలాఖరులోగా సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించి.. వచ్చే నెలలో నివేదిక ఇస్తామని క్యాంపస్ క్రాప్ నిర్వాహకులు వెల్లడించారు. 40 నిమిషాల పాటు సాగే సైకోమెట్రిక్ పరీక్ష ద్వారా విద్యార్థుల బలాలు, బలహీనతలు, ఆశలు, ఆసక్తి, అంచనాలను మదిస్తామన్నారు.
ఇంటర్ తర్వాత విద్యార్థులకు అందుబాటులో ఉండే సుమారు 300 కెరీర్ అవకాశాలు, దాదాపు 1500 ఎంట్రెన్సులు, సుమారు 30 వేల కళాశాలల వివరాలూ పోర్టల్‌లో ఉంటాయని సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. కార్యక్రమంలో క్యాంపస్ క్రాప్ ప్రతినిధులు డాక్టర్ ఆర్యశ్రీ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: క్యూఆర్ కోడ్.. మహిళల రక్షణకు షీ టీమ్ వినూత్న ఆలోచన.!