పెళ్లైన తర్వాత కొంతమంది భాగస్వామిని మార్చడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు. అది ఎంతకీ సాధ్యంకాక అసహనానికీ గురవుతుంటారు. అందుకే ఒకసారి ఈ విధంగానూ ఆలోచించి చూడండి.
ఒకేలా ఆలోచించాలనుకోవడం... భిన్న కుటుంబాల నుంచి వచ్చిన భాగస్వాముల ఆలోచనలు, అలవాట్లు వేర్వేరుగా ఉండటం సహజమే. ఈ విషయాన్ని మర్చిపోయి ఎదుటివాళ్లు అచ్చం మనలాగే ఆలోచించాలనీ, మనలాగే స్పందించాలనీ కోరుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదు. ఒకే తల్లి కడుపున పుట్టిన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల ఆలోచనలే ఒకలా ఉండవు. అలాంటప్పుడు పెళ్లి పేరుతో ఒక్కటైనవాళ్ల ఆలోచనలు కలవాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది.
మార్చేయాలనుకోవడం... కొంతమంది పెళ్లి కావడంతోనే ఎదుటివారిని మార్చే ప్రయత్నాలు మొదలు పెట్టేస్తుంటారు. అది ఎదుటివారిని ఎంతో అసహనానికి గురిచేస్తుందనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోరు. ఇంట్లోనే ఉండాలనీ, స్నేహితులు, బంధువులతో బయటకు వెళ్లకూడదని రకరకాల షరతులు విధిస్తుంటారు. ఎదుటివారు పూర్తిగా తాము చెప్పినట్టుగానే వినాలనుకుంటారు. దీంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు మొదలవుతాయి.
పట్టు పట్టడం మంచిది కాదు... ‘నువ్వు పూర్తిగా మారిపోవాలి. నేను చెప్పినట్టుగానే నడుచుకోవాలి’ అని పట్టుపట్టడం వల్ల మీ మొండితనమే బయటపడుతుంది తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీ మీద ఉన్న సదాభిప్రాయం కాస్తా పోతుంది.
మారి చూడండి... ఎదుటివాళ్లలో మార్పు కోసం ఎదురుచూసే బదులు.. వాళ్లకు అనుగుణంగా మీరే మారండి. వాళ్లను అర్థం చేసుకోవడానికి మీ వంతుగా ప్రయత్నించండి. అప్పుడు మీ మీది అభిమానంతో వాళ్లే ఇష్టంగా మారొచ్చేమో.
ఇదీ చదవండి: హైదరాబాద్లో జాతీయ డాన్స్ ఫెస్టివల్