Indrasena Reddy Appointed as Tripura Governor : త్రిపుర గవర్నర్‌గా తనను నియమించడం సంతోషంగా ఉందని నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. గవర్నర్‌గా అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి చెప్పారన్నారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీలో పని చేసిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు తన నియామకమే నిదర్శనమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 3 సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన మలక్‌పేట ప్రజలకు ఈ గుర్తింపు దక్కుతుందన్న ఆయన.. వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు.
Indrasena Reddy as Tripura Governor : ఈ క్రమంలోనే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడతానని ఇంద్రసేనారెడ్డి తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకానికి బీజేపీ ప్రాధాన్యత ఇచ్చిందన్న ఆయన.. అక్కడ టూరిజం డెవలప్మెంట్ బాగా జరుగుతోందన్నారు. మరింత అభివృద్ధికి దోహదపడేలా పని చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు.
Political Heat in Telangana 2023 : రాష్ట్రంలో ఎలక్షన్ హీట్.. ప్రచారాలతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు
"గవర్నర్‌గా అవకాశం కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పారు. బీజేపీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందనడానికి ఇది నిదర్శనం. 40 ఏళ్లుగా బీజేపీలో పని చేస్తున్న నాకు ఈ పదవి రావడం మూడు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన మలక్‌పేట వాసులకు దక్కుతుంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది కార్యక్రమాల్లో మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. మరింత అభివృద్ధికి దోహదపడేలా పని చేస్తాను. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు." - నల్లు ఇంద్రసేనారెడ్డి, త్రిపుర గవర్నర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 1953 జనవరి 1న జన్మించిన ఇంద్రసేనారెడ్డి.. 1983, 1985, 1999 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో మలక్‌పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1994లలో అదే నియోజకవర్గంలో ఓడిపోయారు.
1999లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ సభా పక్ష నేతగా ఇంద్రసేనారెడ్డి పని చేశారు. 2003-07 మధ్య కాలంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన సేవలందించారు. 2014లో పార్టీ జాతీయ కార్యదర్శిగా, 2020లో పార్టీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. 2004లో నల్గొండ, 2014లో భువనగిరి లోక్‌సభ స్థానాలకు పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.
ఇంద్రసేనారెడ్డి నియామకంతో తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నర్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారి సంఖ్య 3కు చేరింది. ఈయన కంటే ముందు ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పని చేసిన వి.రామారావు, సీహెచ్ విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయలు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. త్రిపుర గవర్నర్‌గా ఇప్పటి వరకు బిహార్ రాష్ట్రానికి చెందిన సత్యదేవ్ నారాయణ్ ఆర్య పని చేశారు. ఆయన స్థానంలో తాజాగా కేంద్రప్రభుత్వం ఇంద్రసేనారెడ్డిని నియమించింది.
Kishan Reddy Fires on BRS : "బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా.. యువత నిశ్శబ్ధయుద్దం చేస్తోంది"
సీఈసీకి ఫిర్యాదు..: నల్లు ఇంద్రసేనారెడ్డి నియామకంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. చీఫ్ ఎలక్షన్ అధికారి రాజీవ్‌కుమార్‌కు పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ నిరంజన్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే.. ఇక్కడి వ్యక్తిని త్రిపుర గవర్నర్‌గా నియమించడం సరికాదని.. ఇది ఓటర్లను ప్రభావితం చేసే చర్య అని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులో పేర్కొంది. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకాన్ని నిలిపివేయాలని కోరింది.